ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరు తెచ్చుకున్న ఎవరెస్టు పర్వత శిఖరంపై ఉన్న 2000 ఏళ్ల నాటి హిమనదం ఈ శతాబ్దం మధ్యకల్లా అంతర్ధానం కానుందని, ఎందుకంటే ఎవరెస్టు పర్వతంపై మంచుగడ్డ శరవేగంగా కరిగిపోతుండడమే దీనికి కారణమని నేపాల్ శాస్త్రవేత్తలు మంగళవారం హెచ్చరించారు.
1990 దశకం చివరినుంచి ఎవరెస్టు పర్వతంపై మంచు గణనీయంగా తగ్గిపోతోందని ఇటీవల విడుదలయిన తాజా పరిశోధన నివేదికను ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ (ఐసిఐఎంఒడి)పేర్కొంది. ‘ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్’ అనే పర్వతారోహక బృందం హిమనదాలు, పర్వతాలకు సంబంధించిన వాతావరణాలపై విస్తృతమైన పరిశోధన నిర్వహించినట్లు ఆ సంస్థ తెలిపింది.
ఎవరెస్ట్‌పై మంచు ప్రమాదకరమైన స్థాయిలో కరిగిపోతోందని ‘నేచర్ పోర్ట్‌ఫోలియో’ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన పరిశోధనా వ్యాసం పేర్కొంది. వివిధ రంగాలకు చెందిన వారితో కూడిన ఈ బృందంలో ఎనిమిది దేశాలకు చెందిన శాస్త్రజులున్నారు. వీరిలో నేపాల్‌కు చెందిన వారు 17 మంది ఉన్నారు.
ఈ పరిశోధక వ్యాసాన్ని రూపొందించిన వారిలో ముగ్గురు ఐసిఐఎంఒడికు సంబంధించిన వారున్నారు. ఎవరెస్ట్ శిఖరంపై 8,020 మీటరల ఎత్తులో ఉన్న సౌత్‌కోల్ గ్లేసియర్ అనే హిమనదంలో మంచు ఏడాదికి దాదాపు 2 మీటర్ల చొప్పున తగ్గిపోతున్నట్లు ఈ పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
నేపాల్ వైపు ఎవరెస్ట్ పర్వతంపై ఉన్న హిమనీనదం నుంచి సేకరించిన మంచు ఫలకంపై జరిపిన అధ్యయనాలు, ఎవరెస్టుపై ఉన్న రెండు ఆటోమేటిక్ వెదర్ స్షేన్లనుంచి సేకరించిన వాతావరణ వివరాల ఆధారంగా వారు ఈ అభిప్రాయానికి వచ్చారు.
దీని ఆధారంగా ఈ శతాబ్దం మధ్య నాటికి ఈ హిమనదం మాయమై పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. మంచు ఈ మందంలో ఏర్పడడానికి ఎంత కాలం పట్టిందో దానికన్నా 80 రెట్లు వేగంగా మంచు కరిగిపోతోందని వారు ఆ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.