కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమక్రమంగా అదుపులోకి వస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, జనవరి 21 నాటి గరిష్ట స్థితితో పోలిస్తే కేసులు 80 శాతం తగ్గాయని తెలిపింది.
ఇక నాలుగు రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల సంఖ్య 50వేల పైన ఉందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 24వ తేదీన పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 20.75శాతానికి పెరిగింది. అయితే ప్రస్తుతం అది 4.44 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
దీనిబట్టి చూస్తే వైరస్ వ్యాప్తి రేటు క్రమంగా తగ్గుతోందని పేర్కొన్నారు. ఇక జనవరి 21న కొత్త కేసులు ఏకంగా 3.47 లక్షలు దాటాయి. అప్పటితో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య 80 శాతం తగ్గిందని చెప్పారు.
అయితే, కేరళలో కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. అక్కడ రోజువారీ పాజిటివిటీ రేటు అత్యధికంగా 29.57శాతంగా ఉంది. ఇక మిజోరం, హిమాచల్‌ప్రదేశ్ , అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలలోనూ పాజిటివిటీ రేటు ఆందోళనకరంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దాదాపు 40 జిల్లాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొంది. 141 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉండగా 160 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్యలో ఉన్నట్లు తెలిపింది.
కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో క్రీయాశీల కేసులు కూడా దిగొచ్చాయి. ప్రసుత్తం దేశవ్యాప్తంగా 7.90 లక్షల మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్ కేసుల రేటు 1.86 శాతానికి తగ్గింది.
కేరళ , మహారాష్ట్ర తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ఇక 11 రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు 10వేల నుంచి 50వేల మధ్యలో ఉన్నట్లు తెలిపింది.
కరోనా వ్యాక్సినేషన్లో దేశంలో త్వరలో మరో అరుదైన మైలురాయిని అందుకోనుంది. ఇప్పటివరకు అర్హులైన వయోజనుల్లో 90.23కోట్ల మంది అంటే 96 శాతం మందికి తొలి డోసు పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో ఇది 100 శాతానికి చేరుకుంటుందని తెలిపింది.
78 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు పేర్కొంది. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నిర్విరామంగా కొనసాగుతోంది. టీకా పంపిణీని విస్తరిస్తూ జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్లు అందజేస్తున్నారు.
ఇప్పటివరకు 14శాతం మంది (1.05కోట్లమంది) టీనేజర్లు రెండు డోసుల టీకా తీసుకోగా …69శాతం మందికి తొలిడోసు అందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 1.61కోట్ల మందికి ప్రికాషనరీ డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.