కేంద్ర ప్రభుత్వ పథకం సంసద్ ఆదర్శ్ యోజన కింద ఎంపీలు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న గ్రామాలలో దేశం మొత్తం మీద ఉత్తమంగా ఎంపికైన మొదటి 10 గ్రామాలలో మొదటి రెండు స్థానాలలో గ్రామాలతో పాటు 7 గ్రామాలు తెలంగాణవే కావడం విశేషం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామాలు 4, ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన 3 గ్రామాలు ఉన్నాయి.
ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన సైదాపూర్మండలం వెన్నంపల్లి గ్రామం జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించగా, బెజ్జంకి మండలం గన్నేరువరం 4, ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి 6, వీణవంక మండలం రామకృష్ణాపూర్ 9, ఉమ్మడి నిజామాబాద్జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామం 2, రెంజల్ మండలం కందకుర్తి 5, నిజామాబాద్ మండలం తానాకుర్ద్ గ్రామం 10వ స్థానంలో నిలిచాయి.
మొదటి స్థానంలో నిలిచినా వెన్నంపల్లి గ్రామం జనాభా 2,167. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు 2014–-15లో వెన్నంపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. రూ. 1.5 కోట్లు ఎంపీ ఫండ్స్ మంజూరు చేశారు. పల్లె ప్రగతి కింద వచ్చిన నిధులనూ గ్రామస్తులు సద్వినియోగం చేసుకున్నారు. గ్రామంలోని అన్ని కాలనీలలో సీసీ రోడ్లు నిర్మించారు.
నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేయగా పనులు పూర్తికావచ్చాయి. గ్రామంలో రూ. 4 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రూ. 20 లక్షలతో మహిళా సంఘ భవనాన్ని నిర్మించుకున్నారు. రూ. 16 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య భవనం, రూ. 12 లక్షలతో మురుగు కాలువల నిర్మాణాలు పూర్తి చేశారు.
గ్రామంలో ఉపాధి కల్పన పథకం ద్వారా మహిళా సంఘాల కుటుంబ సభ్యులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి 60 మందికి కుట్టు మెషిన్ శిక్షణ ఇప్పించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ప్రాథమిక పశువైద్య కేంద్రం భవనాలు నిర్మించుకున్నారు. గ్రామంలో పెట్రోల్ బంక్ ను కూడా నిర్వహిస్తున్నారు.
గ్రామంలో రూ. 65 వేలతో తడి, పొడి చెత్త బుట్టలను కొనుగోలు చేసి ప్రతి ఇంటికీ పంపిణి చేశారు. ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి రోజు తడి పొడి చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా సెగ్రిగేషన్ షెడ్ కు తరలిస్తున్నారు. ఇలా సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు ఎరువు తయారు చేసుకుంటున్నారు.
రెండో స్థానం పొందిన కౌలాస్ గ్రామం మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల బార్డర్లో ఉంది. గ్రామ జనాభా 2,188. మారుమూలలో ఉన్న ఈ గ్రామాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దత్తత తీసుకున్నారు.
మరోవైపు వెనుకబడిన ఏరియాల్లోని గ్రామాల్లో పట్టణస్థాయి వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో జుక్కల్ మండలం కూడా ఉంది. కౌలాస్‌కు అటు సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన, ఇటు రూర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ కలిసి వచ్చాయి. దీంతో ఇక్కడ ఐదేళ్లలో రూ. 10 కోట్ల మేర ఫండ్స్‌తో డెవలపెంట్వర్క్స్ జరిగాయి.
ఒక ఊరికి కావాల్సిన అన్ని రకాల వసతులు సమకూరాయి. స్కూల్ బిల్డింగ్, కాంపౌండ్ వాల్, రెండు అంగన్వాడీ బిల్డింగులు, లైబ్రరీ బిల్డింగ్, హెల్త్ సబ్ సెంటర్, వెటర్నరీ హాస్పిటల్ బిల్డింగ్, పశువులకు నీటి తొట్ల నిర్మాణం, బస్ షెల్టర్, సోలార్ వీధి లైట్లు, పంచాయతీ బిల్డింగ్, పిల్లలకు ఆట పరికరాలు, హాస్టల్ బిల్డింగ్, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, మంకీ కోర్టుతో పాటు గ్రామానికి ఇరు వైపులా ఉన్న రోడ్ల వెంట మొక్కల పెంపకం చేపట్టడంతో పచ్చదనాన్ని సంతరించుకుంది.
ప్రతి ఇంటిలో ఇంకుడుగుంత, వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. పంట ఉత్పత్తుల నిల్వకు గోదాం నిర్మించారు. 80 మంది రైతులకు పశువులు ఇచ్చారు. 8 మందికి పొలాల్లో బోర్లు తవ్వించి కరెంటు కనెక్షన్లు ఇచ్చారు. గ్రామాల్లో ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం 36 ఆంశాలకు సంబంధించి పరిశీలన చేయగా కౌలాస్ దేశంలో రెండో స్థానంలో నిలిచింది.