రాష్ట్రంలోని విద్యాసంస్థలను తెరుచుకోవచ్చని పేర్కొంటూ ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు విద్యార్థులు తమ మతాచారాలను ప్రతిబింబించేలా ఎలాంటి దుస్తులు ధరించకూడదని స్పష్టం చేస్తూ విద్యార్థునులపై హిజాబ్ నిషేధం కొనసాగించే విధంగా కర్ణాటక హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది.
కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తరువులు ఇవ్వడానికి నిరాకరించింది. సమస్య పెండింగ్లో ఉన్నంత కాలం విద్యార్థులు మతపరమైన ఎలాంటి దుస్తులు ధరించరాదని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి (14వ తేదీ) వాయిదా వేసింది.
అయితే ఈ ఆదేశాలు తమ క్లయింట్ రాజ్యాంగ హక్కులను సస్పెండ్ చేయడమేనన్న తన అభ్యంతరాన్ని పరిశీలించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది దేవదత్త కామత్ కోరగా, ఈ ఏర్పాటు సమస్య పరిష్కారమయ్యేంత వరకు కొద్ది రోజులు మాత్రమేనని చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి పేర్కొన్నారు.
విచారణను వాయిదా వేయడానికి ముందు చీఫ్ జస్టిస్ అవస్థి మాట్లాడుతూ, ఈ సమస్య కోర్టులో పెండింగ్లో ఉన్నంతవరకు విద్యార్థులెవరూ తమ మతాచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించరాదని స్పష్టం చేశారు. వీలయినంత త్వరగా సమస్య పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నామని, అయితే అప్పటివరకు శాంతి సామరస్యాన్ని పరిరక్షించాలని పేర్కొన్నారు.
కాగా ఈ పిటిషన్పై విచారణ కోసం కోర్టు బుధవారం చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం ఖాజీలతో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
హైకోర్టు తీర్పు అనంతరం తొలి దశలో సోమవారం నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను అనుమతించాలని, ఆ పై తరగతులకు సంబంధించి మాత్రం తర్వాత నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ విషయమై మంత్రులతో సమావేశమై చర్చిస్తారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, పోలీసు అధికారులు కూడా హాజరవుతారు.
కొద్ది రోజుల క్రితం కర్ణాటకలోని ఉడుపిలోని ఓ ప్రభుత్వ కాలేజీకి కొంత మంది విద్యార్థినులు హిజాబ్ వేసుకుని రావడంపై అధికారులు అభ్యంతరం తెలిపారు. కాలేజీకి ప్రతి ఒక్కరూ యూనిఫామ్ మాత్రమే వేసుకుని రావాలని సూచించారు.
హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను అడ్డుకోవడంతో వాళ్లు నిరసనలు చేపట్టారు. దీనిపై క్రమంగా పరస్పర నిరసనల వరకూ దారితీయడంతో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని కర్ణాటక సర్కారు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.