(నేడు దీనదయాళ్ జీ వర్ధంతి)చదువులలో చిన్నతనం నుంచే విశేషమైన ప్రతిభను ప్రదర్శించారు. అయితే ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలవైపు చూడకుండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) పట్ల ఆకర్షితులై, సంఘ ప్రచారక్ గా తన జీవితాన్ని సామాజిక సంఘటన కోసం అంకితమైన పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ స్వతంత్ర భారత దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం కోసం, మొత్తం ప్రజల వికాసం కోసం విశేషమైన ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యునిగా, ఒక రాజకీయ పార్టీగా దాని ఎదుగుదలకు మొదటి నుండి బలమైన పునాది ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. అంతేకాదు మిగిలిన రాజకీయ పార్టీలు భిన్నంగా విశిష్టమైన ఆర్ధిక, సామాజిక, ధార్మిక సైద్ధాంతిక పునాదిని పార్టీకి ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత బిజెపిగా రూపాంతరం చెంది, పలు రాష్ట్రాలలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాలు, అమలు పరుస్తున్న పలు కార్యక్రమాలకు దీనదయల్ ప్రబోధించిన విలువలు, సిద్ధాంతాలే మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి కూడా దీనదయాళ్ ఆలోచనలే మూలం. ఆయన 1916 సెప్టెంబర్ 25న ఉత్తర ప్రదేశ్ లోని మధుర దగ్గర ‘నగ్ల చంద్రభాన్’ అనే గ్రామంలో జన్మించారు. 51 ఏళ్ళ వయస్సులోనే 1968 ఫిబ్రవరి 11న అనుమానాస్పద పరిస్థితులలో మూర్తి చెందారు.
ఆయన జీవించింది కొద్దికాలమే అయినా, ఆయన ప్రతిపాదించిన సైద్ధాంతిక, సంఘటనాత్మక పునాదిపై నేడు బిజెపి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, బలమైన రాజకీయ పక్షంగా ఎదిగింది. భారతీయ జనసంఘ్ ప్రారంభం నుండి సంఘటనా కార్యదర్శిగా వ్యవహరిస్తూ, 1967లో అధ్యక్ష పదవి చేపట్టిన ఆయన ఆ పదవిలోనే మృతి చెందారు.
రాజకీయ పార్టీలు అంటే కేవలం అధికారం కోసం ఎత్తుగడలు వేయడమే కాదని, ప్రజలకు – దేశానికి స్పష్టమైన విధానాలు అందించి, మార్గదర్శనం చేయడంతో పాటు ప్రజల సర్వోన్నతికి సామజిక సేవ ప్రాతిపదికన పనిచేయాలని జనసంఘ్ నేతలు, నాయకులలో ఆయన బలమైన అభిలాషను పెంపొందింప చేశారు.
చిన్నతనంలోనే తల్లి, తండ్రి మరణించిన దీనదయాళ్ జీ మేనమామ ఇంటిలో పెరిగారు. 1925 ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టిన దయాళ్ కాన్పూర్‌లో బి.ఎ, చదువుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది. సంఘ్‌లో పనిచేస్తూనే బి.ఎ, డిగ్రీ, ఉపాధ్యాయ శిక్షణ ఎంఎ, ప్రథమ సంవత్సరం పూర్తి చేశారు. సంఘ్ విస్తరణకు పూర్తి సమయం ఇచ్చేందుకు చదువుకు స్వస్తి పలికారు.
ఉత్తరప్రదేశ్‌లోని లభంపూర్ ప్రాంతానికి ప్రచారకులుగా వెళ్లి, కొద్ది సంవత్సరాలలోనే ఆ ప్రాంతంలో సంఘ్ కార్యక్రమాలను వికసింపజేశారు. ఉత్తరప్రదేశ్ ప్రాంత సహ ప్రచారకులుగా పనిచేశారు. పత్రికారంగంపై దృష్టి సారించి రాష్ట్ర ధర్మ ప్రకాశన్ అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఆ ప్రకాశన్ ద్వారా రాష్ట్ర ధర్మ అనే ఒక మాస పత్రిక, పాంచజన్య అనే వారపత్రిక, స్వదేశ్ అనే దిన పత్రిక ప్రారంభించారు.
గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని హిందూ మహాసభతో పాటు ఆర్ఎస్ఎస్ పై కూడా అపవాదును మోపి ఆనాటి ప్రధాని నెహ్రూజీ సంఘ్‌ను నిషేధించారు. ఆ నిషేధాన్ని తొలగించాలంటూ జరిగిన ఉద్యమానికి ఉత్తరప్రదేశ్‌లో దీనదయాళ్ జీ నిర్వహించిన పాత్ర గణనీయమైంది. ఈ హత్యానేరంలో సంఘ్ పాత్ర లేదని దీనదయాళ్ జీ పాంచజన్యలో స్పష్టం చేస్తూ ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా రాసిన రచనలకు ఆనాటి ప్రభుత్వం పాంచజన్యను నిషేధించింది.
దానితో, హిమాలయ అనే మరో వార పత్రికను ప్రారంభించి తన కలంతో నాటి ప్రభుత్వానికి కలవరం పుట్టించారు. ఈలోగా గాంధీజీ హత్యానేరంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. జాతి, జాతీయత, భారతీయ సంస్కృతి, ధర్మం మొదలైన విషయాలపై ఆయనలోని అభిప్రాయాలు, మౌలిక సిద్ధాంతాలు తదితరాలపై ఆయన రచనా వ్యాసంగం కొనసాగింది.
నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలు, భారతీయ తత్వజ్ఞాన సారాన్ని దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి సామ్రాట్, చంద్రగుప్త, జగద్గురు శంకరాచార్య అనే చారిత్రక నవలలను కూడా దయాళ్జీ రాశారు.
1951లో డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ప్రధాని నెహ్రూ జీ విధానాలకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చారు. ఆనాడు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నెహ్రూ అనుసరిస్తున్న, ముస్లిం సంతుష్టీకరణ, హిందూ ధర్మ వ్యతిరేక విధానాలను ఎదుర్కొనడానికి, భారతీయ సంస్కృతి సభ్యులతో, జాతీయ భావాలతోకూడుకున్న రాజకీయ పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో ఆనాటి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ గురూజీ సహాయాన్ని అర్థించారు.
ఆయన కోరిక ప్రకారంగా పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ జీ, జగన్నాధరావు జోషి, సుందర్ సింగ్ భాండారి లాంటి మరికొందరు యువకులను గురూజీ ఆయనకు అప్పగించారు. డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ 1951 అక్టోబరు 21న ఏర్పాటు చేసిన జనసంఘ్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా దీనదయాళ్ ఎన్నికయ్యారు. పార్టీ స్థాపించిన మూడు మాసాలకే 1952లో జరిగిన జనరల్ ఎన్నికలలో పోటీ చేసిన నాలుగు జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటిగా జనసంఘ్ ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందింది.
ఆ తర్వాత కాశ్మీర్లో సత్యాగ్రహం చేసిన డాక్టర్ ముఖర్జీ అనుమానాస్పద మరణం చెందారు. డా. ముఖర్జీ మృతి అనంతరం జనసంఘ్ నామరూపాలు లేకుండా పోతుందని ఆశించిన వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ పార్టీని దేశవ్యాప్తంగా పటిష్ఠపరచిన ఘనత దీనదయాళ్‌జీకి, ఆయన సహచరులకు దక్కుతుంది. దేశ రాజకీయాలలో జనసంఘ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో కృతకృత్యులై 1967లో పార్టీ అఖిల భారత అధ్యక్ష పదవిని కాలికట్లో జరిగిన అఖిల భారత జనసంఘ్ మహాసభలో చేపట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొగల్ సరాయి రైల్వే స్టేషన్లో 1968 ఫిబ్రవరి 11న రైలు పట్టాల వద్ద శవమై కనిపించారు. డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ మరణం మాదిరిగానే దీనదయాళ్జీ మరణం కూడా పలు అనుమానాలకు దారితీసింది. దీనదయాళ్జీ వంటి మహావ్యక్తి మరణంతో కార్యకర్తల హృదయాలు ఎంతో మనోవేదన చెందాయి. ఇటీవల భారత ప్రభుత్వం మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్ ను ఆయన జ్ఞాపకార్ధంగా పండిట్ దీన్ దయాల్ రైల్వే స్టేషన్ గా నామకరణం చేసింది.