స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ఇండో పసిఫిక్‌ను సాధించేందుకు, ఉగ్రవాదం వంటి ఉమ్మడి శత్రువును సమిష్టిగా ఎదుర్కొనేందుకు కృషి చేయాలని క్వాడ్ విదేశాంగమంత్రుల సమావేశం నిర్ణయించింది. భారత్ పై జరిగిన ఉగ్రవాద దాడులపై క్వాడ్ నేతలు మొదటిసారిగా స్పందించారు.
ఆస్ట్రేలియా ఆతిధ్యంలో శుక్రవారం మెల్బోర్న్ లో జరిగిన ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయషి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మెరైజ్ పేన్ హాజరయ్యారు.
ఈ సమావేశం అనంతరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా గోష్టిలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పేన్ మాట్లాడుతూ, దేశ సార్వభౌమత్వ పరిరక్షణ, బహిరంగ, సమ భాగస్వామ్యం వంటి విలువలకు క్వాడ్ తన మద్దతును పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, క్వాడ్ దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టవంతం కావాలని కోరారు. దృఢమైన సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం క్వాడ్‌ను శక్తివంతమైన ఫ్రేమ్వర్కుగా మార్చాయని తెలిపారు.
2008లో ముంబయిలో జరిగిన తీవ్రవాద దాడులు, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన దాడులకు కారకులైనవారిని శిక్షించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది. ఈ తీవ్రవాద దాడులపై క్వాడ్ స్పందించడం ఇదే మొదటిసారి. భారత్‌లో తయారుచేయనున్న వంద కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ల పంపిణీని వేగవంతం చేయాలని సమావేశం తీర్మానించింది.
వాతావరణ మార్పులపై ఈ ఏడాది ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర జలాల భద్రతకు హామీ కల్పించే యత్నాలను పెంపొందించాలని కోరారు. సమావేశానంతరం నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
తీవ్రవాద దాడులు జరిపేందుకు తమ ఆధీనంలో వున్న భూభాగాలను వుపయోగించరాదని అన్ని దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నామని ప్రకటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా రాకపోకలు జరిపేందుకు, ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి వున్నట్లు పునరుద్ఘాటించడం ద్వారా పరోక్షంగా దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో చైనా దుశ్చర్యలను సమావేశం ప్రస్తావించింది.
ఉక్రెయిన్ విషయంలో రష్యా-నాటో ఉద్రిక్తతలు, మయన్మార్ మిలటరీపై ఆంక్షలు వంటి అంతర్జాతీయ పరిణామాలపై క్వాడ్ మంత్రుల మధ్య విభేదాలు తలెత్తినట్లు కనిపిస్తోంది. ”మేం ఆందోళనలు చెందే చోట జాతీయ ఆంక్షల విధానాన్ని అనుసరించం’ అని మంత్రి ప్రకటించారు.
మయన్మార్‌లో కుట్ర తర్వాత పరిస్థితులతో భారత్ చాలా ఇబ్బంది పడిందని పేర్కొన్నారు. మయన్మార్‌పై అమెరికా తాజా ఆంక్షల గురించి ప్రశ్నించగా, ఆహార కొరతలతో అక్కడ మానవతా సంక్షోభం తలెత్తే పరిస్థితులు వున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, చైనాను అదుపు చేసేందుకు ఉద్దేశించిన సాధనంగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అభివర్ణించారు. ఘర్షణలు పెచ్చరిల్లేలా చేయడానికి, అంతర్జాతీయ సంఘీభావాన్ని, సహకారాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశ పూర్వకంగా చేసే చర్యగా చైనా ప్రతినిధి ఝావో లిజన్ బీజింగ్‌లో విమర్శించారు. కాలం చెల్లిన ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వాన్ని విడనాడాలని క్వాడ్ దేశాలను కోరారు.