మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు కడప జైలులో హాని ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. వారి హత్యకు కుట్ర జరుగుతోందని తెలిపారు. మొద్దుశ్రీను హత్య సమయంలో అనంతపురం జైలర్‌గా ఉన్న వరుణ్‌రెడ్డిని ఇప్పుడు కడప జైలర్‌గా నియమించారని చెప్పారు.
వివేకా హత్యకేసులో నిందితులు ప్రస్తుతం కడప జైలులో ఉన్నారని పేర్కొన్నారు. కడప జైలర్‌గా వరుణ్‌రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. జగన్‌రెడ్డి , అవినాష్‌రెడ్డి సాయంతో వరుణ్‌రెడ్డి ద్వారా వారికి ప్రాణహాని పొంచి ఉందని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు.
శనివారం విజయవాడ పటమటలోని తమ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయన్ను పరామర్శించారు. సీఐడీ అరెస్టు, తదనంతర పరిణామాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ .. ఎక్కడ అన్యాయం జరిగినా .. పరిష్కారం కోసం టిడిపి ముదుంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబును అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ముగ్గురు మాజీ మంత్రులను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత రెండున్నరేళ్లలో 33 మంది టిడిపి నేతలను హత్య చేశారని చెబుతూ . అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరి పక్షాన పోరాడి వైసిపి ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతామని చెప్పారు. తప్పుచేసే ప్రతి అధికారి తప్పించుకోలేరని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు.