ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపిలపై కొద్దీ రోజులుగా ముప్పేట దాడులకు దిగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తొలిసారిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత బిజెపిపై దండెత్తే క్రమంలో కాంగ్రెస్ పట్ల సానుకూలంగా మాట్లాడటం ఇదే ప్రధమం కావడం గమనార్హం.
రాహుల్ గాంధీ పుట్టుకపై అసోం ముఖ్యమంత్రి, బిజెపి నేత హేమంత్ బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీగా రాహుల్ ప్రశ్నిస్తే , బిజెపి సమాధానం చెప్పలేకపోయిందని ధ్వజమెత్తారు. తండ్రి గురించి తప్పుగా మాట్లాడటం బిజెపి విధానమా? అంటూ ప్రశ్నించారు. జేపీ నడ్డా, మోడీలు సమాధానం చెబుతారా? అని నిలదీశారు.
పైగా, రాహుల్ పై శర్మ మాటలు విని తనకు కన్నీళ్లొచ్చాయని కేసీఆర్ తీవ్రమైన సానుభూతి చెలపడంతో పాటు అస్సాం సీఎంని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై , బీజేపీ విమర్శలను తప్పుబట్టారు.
యాదాద్రి జిల్లాలో పర్యటన సందర్భంగా రాయగిరిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ హిందూధర్మం అంటే ఇదేనా? అని బిజెపి నేతలను నిలదీశారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందని పేర్కొంటూ పిచ్చి పిచ్చి పాలసీలు తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.
‘‘మోదీ, దేశం నీ అబ్బ సొత్తు కాదు. లాఠీ, లూటీ, మతపిచ్చి.. ఇదే బీజేపీ సిద్ధాంతం. ప్రజా సమస్యలను పక్కనపెట్టి..మత రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టాలి. మోదీ చేతగానితనం వల్లే దేశంలో విద్యుత్ కోతలు, నీళ్ల తగాదాలు వస్తున్నాయి. అభివృద్ధిలో భారత్ స్థానం 101″ అంటూ విమర్శించారు.
ఏడాది పాటు రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి ఎక్కి రైతులతో పెట్టుకోవడం మంచిది కాదని హెచ్చరించారు. 8 ఏళ్ల బిజెపి పాలనలో దేశాన్ని సర్వనాశనం చేసిందని చెబుతూ ఏంది చూసేది తోకమట్టనా? కెసిఆర్ సంగతి చూస్తా అంటే బయపడే వాడు ఎవడు లేడని స్పష్టం చేశారు.
హిజాబ్ అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందిస్తూ మత పిచ్చి లేపి కర్ణాటక లో ఆడపడుచులను ఆగంచేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. బిజెపి వాళ్ళు కుక్కల లెక్క అరవడం మానాలని హితవు చెప్పారు. పొద్దున లేస్తే కర్ఫ్యూలు- ఘర్షణలు అవసరమా? అని అడిగారు.
అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని చెబుతూ రైతుబంధుతో గ్రామాలు పచ్చబడ్డాయని తెలిపారు. అయితే ఉద్యోగులకు సంబంధించి చిన్న చిన్న సమస్యలున్నాయని చెబుతూ 40 ఏళ్లపాటు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ సరళీకరిస్తామని కేసీఆర్ ప్రకటించారు.