బ్యాంక్‌లకు వేల కోట్లు కన్నం వేసిన విజయ మాల్యా, నీరవ్ మోడీల వ్యవహారం మర్చిపోకముందే మరో ఘటన బయటపడింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న ఎబిజి షిప్‌యార్డ్ కంపెనీ దేశంలోని 28 బ్యాంక్‌లకు టోకరా ఇచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ కన్సోరియంలోని పలు బ్యాంక్‌లకు ఏకంగా రూ.22,842 కోట్లకు మోసం చేసింది. ఇప్పటి వరకు దేశంలో ఇదే పెద్ద రుణాల ఎగవేత కుంభకోణం.
దీంతో ఆ కంపెనీ సిఎండి, డైరెక్టర్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎబిజి షిప్‌యార్డ్ సిఎండి రిషి కమలేష్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానమ్ ముతస్వామి, మరో ముగ్గురు డైరెక్టర్లు అశ్వినీ కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవెటియాలపై మోసం, క్రిమినల్ కేసులు పెట్టింది.
ఎబిజి గ్రూప్ గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా పనిచేస్తుంది. షిప్‌ల తయారీ, వాటి రిపేర్ వ్యాపారాలను కలిగి ఉంది. గత 16 ఏళ్లలో 165 వాణిజ్య ఓడలను తయారు చేసింది. ఈ సంస్థకు బ్యాంక్‌లు వరుస కట్టి అప్పులివ్వడం గమనార్హం. ఎస్బిఐ ఫిర్యాదుతో సిబిఐ కేసు నమోదు చేసింది.
ఎజిబికి ఐసిఐసిఐ బ్యాంక్ అత్యధికంగా రూ.7,089 కోట్లు అప్పులిచ్చింది. ఐడిబిఐ బ్యాంక్ రూ.3,639 కోట్లు, ఎస్బిఐ రూ.2,925 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1,614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.1,244 కోట్ల చొప్పున రుణాలిచ్చిన వాటిలో ఉన్నాయి.
దేశంలోని దాదాపుగా అన్ని బ్యాంక్‌ల నుంచి అప్పులు తీసుకుంది.
2012 ఏప్రిల్ నుంచి 2017 జులై మధ్య ఎజిబి లావాదేవీలపై ఎరొస్ట్ అండ్ యంగ్ ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహించింది. ఇందులో నిధుల మళ్లింపు సహా అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.
2015 నుంచి ఈ కంపెనీ పరపతి పడిపోతూ వచ్చింది. 2016 జులైలో ఈ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా బ్యాంక్‌లు గుర్తించాయి. భారత బ్యాంక్‌లకు విజయ్ మాల్యా రూ.9వేల కోట్లు పైనా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ రూ.14వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులను సిబిఐ విచారిస్తున్న విషయం తెలిసిందే.