తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 17న కేంద్ర హోంశాఖ జరుపనున్న భేటీకి సంబంధించిన అజెండా నుండి ప్రత్యేక హోదా అంశాన్నికేంద్రం తొలగించడం ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్నది. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలను తొలగిస్తూ లేఖ రాసింది. విభజన కమిటీ అజెండాలో ఏపీ ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు లేదని తెలిపింది.
మొదట ఇచ్చిన సర్క్యులర్‌లో ఎనిమిదో అంశంగా ప్రత్యేక హోదా ఉంది. హోదా అంశాన్ని తొలగిస్తూ కేంద్రం మరో సర్క్యులర్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కేంద్ర హోంశాఖ కమిటీ ఏర్పాటు చేయనుంది.
ఎజెండాలో సవరణలు చేస్తూ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. 9 అంశాల నుంచి 5 అంశాలకే కేంద్ర హోంశాఖ పరిమితం చేసింది. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు లేదని తెలిపింది. వెనుకబడిన జిల్లాకు నిధులు, పన్ను రాయితీలను కేంద్రం తొలగించింది.
కాగా, కేంద్రం హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కేవలం రెండు రాష్ట్రాల మధ్య.. ఆర్థికపరమైన అంశాలను మాత్రమే పరిష్కరిస్తుందని, కేవలం ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదాను అజెండాలో చేర్చివలసిన అవసరం లేదని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించడం పెద్ద దుమారం రేపింది.
ఇదే అంశంపై కేంద్రహోంశాఖ అధికారులతో తాను మాట్లాడగా కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో ప్రత్యేక హోదా ఇతర అంశాలపై చర్చలేదని అధికారులు చెప్పారని ఆయన ప్రకటించడం ఆయనే అజెండా మార్పించారా అనే అనుమానాలకు తావిస్తున్నది.
రాష్ట్ర విభజనకు సంబంధించి త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకువచ్చిన 9 అంశాలను మార్చాలని వెంటనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ప్రకటన ఆయన మనస్తత్వాన్ని సూచిస్తోంది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే జీవీఎల్ ఎందుకంత హడావిడి పడి సుమోటోగా దాన్ని తీసివేయాలని చెప్పారో, ఎందుకు ఆయనకు అంత ఆత్రమో ఆయనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
9 అంశాల ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నాం అన్న ప్రకటన కూడా చేయకపోవడం, చంద్రబాబు మొహం మాడిపోవడం చూస్తే బీజేపీలోని టీడీపీ వర్గం, ప్రత్యేకించి సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగి ఎజెండాను మార్పించారని స్పష్టమవుతుందని రాంబాబు ఆరోపించారు.
“హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా? తన అధికారాలు ఏమిటో తమకే తెలియదా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య ప్రత్యేక హోదా, రీసోర్సెస్ గ్యాప్ అన్నవి చర్చనీయ అంశాలు కాకపోయినా ఈ అంశాన్ని త్రిసభ్య కమిటీ నేరుగా ఏపీ అధికారులతో చర్చించవచ్చు కదా. మరి దాన్ని కూడా ఆపాలని ఎందుకు ప్రయత్నించారు?” అంటూ ఆయన ప్రశ్నించారు.
తొలుత, కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు.