సినీ పరిశ్రమకు, ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య అంతరం ఏర్పడి, ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో `మెగాస్టార్’ చిరంజీవి చొరవ తీసుకొని సినీ ప్రముఖులతో కలసి ముఖ్యమంత్రిని కలవడం పట్ల తెలుగు సినీ పరిశ్రమలో హర్షం వ్యక్తం అవుతున్నా ఈ విషయమై చిరంజీవి జగన్ ను `యాచించి’ న్నట్లు వీడియో వెలువడంతో టాలీవుడ్ లో పెద్ద దుమారం చెలరేగుతుంది.
చిరంజీవి తన స్థాయిని మరిచి ఏపీ ప్రభుత్వాన్ని యాచించడం నచ్చలేదని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భేటీకి సంబంధించి విడుదలైన వీడియోపై స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వాన్ని చిరంజీవి తన స్థాయిని మరిచి.. అంతగా అభ్యర్థించాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. దీనిపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
మరోవంక, ప్రముఖ నిర్మాత – దర్శకుడు రాంగోపాల్ సహితం `హీరోలు అంతా వెళ్లి జీరోలు అయ్యారు” అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. వీరందరిని రప్పించుకొని జగన్ తానే అసలైన హీరో అనిపంచుకున్నాడని అవహేళన చేశారు.
జగన్‌ను చిరంజీవి బృందం కలవడం మంచి పరిణామం అయినా . ఫిల్మ్ ఛాంబర్‌తో సంబంధం లేకుండా వ్యక్తులను పిలిచి భేటీ జరపడం అప్రజాస్వామికం అని ప్రముఖ నటుడు నరేష్ విమర్శించారు . ఛాంబర్ ఆధ్వర్యంలో అధికారికంగా ప్రజాస్వామ్యబధ్దంగా సామరస్యపూర్వక తీర్మానాలు, పరిష్కారాలు జరిగితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐక్యతను చాటి చెప్పినట్లు ఉండేదని చెప్పారు. ఏదేమైనా త్వరలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయిని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయిన తర్వాత సినిమా ప్రముఖులు అంతా బాగా జరిగిందని చెప్పారు. చాలా సంతోషం. ఈ భేటీతో ఏపీ ప్రభుత్వానికి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి విభేదాలు లేవని క్లియర్ చేసినందుకు చిరంజీవిగారికి ధన్యవాదాలు. అయితే ఆయన ఒక మెగాస్టార్. మేము ఇండస్ట్రీకి పెద్దగా భావిస్తున్నాం” అని భరద్వాజ పేర్కొన్నారు.
“ఆయన కూడా ఇండస్ట్రీకి బిడ్డ అని చెప్పుకుంటారు. ఇండస్ట్రీకి పెద్దయినా, బిడ్డయినా ఆయనకి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది. సినీ ఇండస్ట్రీకి ప్రతినిధిగా వెళ్ళినప్పుడు స్వతహాగా ఆయనే పెద్ద మనిషి. కానీ సీఎం జగన్‌గారితో ఆయన మాట్లాడుతున్న వీడియో చూస్తే ఆయన ఆత్మగౌరవం పక్కనపెట్టి యాచించినట్లు ఉంది. ఆయన అలా అడగడం చూసి.. మనం ఇలాంటి స్టేజ్‌లో ఉన్నామా అని చాలా బాధేసింది” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పైగా, ఈ భేటీలో సినిమా టికెట్ ధరల గురించే కానీ.. ఇండస్ట్రీలో ఉన్న అనేక సమస్యలు గురించి ప్రస్తావన వచ్చినట్లుగా అనిపించడం లేదని ఆయన విమర్శించారు. ఐదో షో అంటూ సీఎంగారు వైజాగ్‌లో స్థలాలు ఇస్తామని.. ఇండస్ట్రీని అక్కడ కూడా డెవలప్ చేయమంటున్నారు. మిగతా సమస్యలపై కూడా సీఎంగారు సానుకూలంగా స్పందించి ఉంటే.. సంతోషించే వాళ్ళమంటూ జరిగిన భేటీపై ఒక విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు ధరల పెంచుతున్నట్లుగా వారు చెప్పినా.. మహా అయితే ఇప్పుడున్న దానికి 15-20 శాతం మాత్రమే పెంచుతారు. వాటి వల్ల వచ్చే తేడా ఎంతో ఉండదు. దానికే సినిమాలు రిలీజ్ చేయలేకపోతున్నామని వారు చెప్పడం ఏంటో నాకు అర్థం కాలేదు అంటూ విస్మయం వ్యక్తం చేశారు. అసలు సినిమాలు రిలీజ్ కాకపోవడానికి కారణం కరోనా. అది కాకుండా కేవలం టికెట్ ధరల వల్లే అని చెప్పడం.. వినడానికి బాధగా అనిపించిందని చెప్పారు.
ఇప్పుడున్న టికెట్ల ధరలతోనే ‘అఖండ’, ‘పుష్ప’ సినిమాలు బాగా వసూలు చేశాయని గుర్తు చేశారు. ఓ రూ 20 నుండి 25 కోట్ల కోసం ఇండస్ట్రీకి దిగ్గజాలైన చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి వంటి వారు వెళ్లి అడుక్కోవడం నిజంగా బాధ అనిపించిందని స్పష్టం చేశారు.
చిరంజీవి వంటి వ్యక్తి అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెబుతూ మనం శాసించే వాళ్లం కాకపోయినా.. టాక్స్‌లు కడుతున్నవాళ్లమే. అలాగే మనం కూడా ఓటేసిన వాళ్లమే అని గుర్తు చేశారు. మన గౌరవాన్ని కాపాడుకుంటూ.. ఎదుటివారిని కూడా గౌరవిస్తూ మాట్లాడాలి. అంతేకానీ, అణిగిపోయి అణగారిన వర్గంలా ఉండాల్సిన అవసరం లేదని భరద్వాజ హితవు చెప్పారు.