ఒక వంక ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో శాంతిభద్రతల రికార్డు చూపి తిరిగి ఎన్నిక కావాలని యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నం చేస్తుండగా, ఆయన ప్రభుత్వం వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.
”తానే ఫిర్యాదీగా, తానే తీర్పు చెప్పేదిగా, తానే ఆ తీర్పును అమలు చేసేదిగా యుపి ప్రభుత్వం వ్యవహరించిందని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.
యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం సిఎఎ కు వ్యతిరేకంగా 2019లో జరిగిన నిరసనల సందర్భంగా ధ్వంసం అయిన ఆస్తులకు నష్ట పరిహారాన్ని నిందితులనుండి రికవరీ చేయడానికి పూనుకున్న కేసుపై విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యానించింది.
వెంటనే రికవరీ ఆపకపోతే తామే ప్రభుత్వ చర్యలను చట్టవ్యతిరేకంగా పరిగణిస్తూ తీన్పు చెప్పవలసివస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. ఆ ఆందోళనలో ధ్వంసం అయిన ప్రభుత్వ ఆస్తులకు నష్ట పరిహారాన్ని తమ వద్దనుండి వసూలు చేయడాన్ని అభ్యంతరపెడుతూ పర్వేజ్ ఆరిఫ్ టిటు, ఆ రికవరీ నోటీసులను చెల్లనివిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
నోటీసులను అడ్డగోలుగా జారీ చేశారని, ఆరేళ్ళ క్రితమే చనిపోయిన 94 సంవత్సరాల వ్యక్తి పేర కూడా నోటీసు జారీ చేశారని, మరో ఏడుగురు 90 సంవత్సరాల వయస్సు దాటినవారికి కూడా నోటీసులు అందాయని పిటిషనర్ పేర్కొన్నారు.
833 మంది ఆందోళనకారులపై 106 ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయని, 274 మందికి రికవరీ నోటీసులను పంపడం జరిగిందని ప్రభుత్వం తరఫున న్యాయవాది గరిమ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. 2009లోను, తిరిగి 2018లోను సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులలో నష్ట పరిహారాన్ని నిర్ణయించే ట్రిబ్యునళ్ళకు న్యాయమూర్తులను నియమించాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అదనపు జిల్లా మెజిస్ట్రేట్లను ఎందుకు నియమించారని ప్రశ్నించారు.
తాము సూచించిన విధంగా ఆ రికవరీ నోటీసులను గనుక వెనక్కి తీసుకోకపోతే సుప్రీం కోర్టు తీర్పుల అమలు ఏ విధంగా జరుగుతుందో తాము చూపిస్తామని జస్టిస్ సూర్య కాంత్ హెచ్చరించారు. కోర్టు సూచనను తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.