కేంద్ర హోం శాఖ రెండు తెలుగు రాష్ట్రాల సమీక్ష సమావేశపు అజెండా నుండి ముందుగా చేర్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తర్వాత తొలగించడంపై ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ కలకలం చోటుచేసుకొంటున్నది.
ఈ విషయమై బిజెపిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఒక వంక జరుగుతూ ఉండగా, నోరుమెదపరే అంటూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం టిడిపి విమర్శలు గుప్పిస్తున్నది. మరోవంక ఇదంతా బీజేపీలోని మాజీ టిడిపి నేతల కుట్ర అంటూ కొందరు వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
పొరపాటున ఎజెండాలోకి వచ్చిన అంశాన్ని తీసివేయడంపై ఈ రసభ ఎందుకంటూ బిజెపి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగిస్తే ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
జగన్ కాళ్ల బేరంతో రాష్ట్రానికి ఎనలేని హాని జరుగుతోందని ధ్వజమెత్తారు. హోదాపై జగన్‌రెడ్డి నటనకు ఆస్కార్ అవార్డు కూడా పనికిరాదని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీలు జగన్ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించి రాజీనామాలకు అడుగు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు.
‘‘మాకు 25 ఎంపీలను ఇవ్వండి.. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై రాజీలేని యుద్ధం చేస్తాం అన్న జగన్‌రెడ్డీ.. ఇప్పుడు మీకు 28 మంది ఎంపీలు ఉన్నారు. యుద్ధం ఏమైందో చెప్పాలి’’ అని పీఏసీ చైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం అజెండాలో పెట్టగానే తమ పోరాట ఫలితమని, తీసేయగానే… చంద్రబాబు చేయించారనీ వైసీపీ నేతలు ప్రచారం చేయడం దుర్మార్గమని మండి పడ్డారు.
‘‘ప్రత్యేక హోదాపై వైసీపీ ప్రభుత్వం కార్యాచరణ ఏమిటి? రాజీనామాలా, లేక లొంగిపోవడమా? స్పష్టంచేయాలి. హోదా కోసం వైసీపీ చిత్తశుద్ధితో పోరాడితే, మేము కలిసిరావడానికి సిద్ధం గా ఉన్నాం. మాకేమీ భేషజాలు లేవు. కేంద్రంపై పోరాటానికి సిద్ధమైతే పాలుపంచుకోడానికి మేమూ సిద్ధమే’’ అని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ ప్రకటించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు, తెలంగాణకు ఎలాంటి సంబంధం లేనందునే అజెండా నుంచి ఆ అంశాన్ని తొలగించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్చించవచ్చని ఆయన సూచించారు.
“‘రాష్ట్రానికి సంజీవినిలాంటి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డ్రామాలాడడం శోచనీయం. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అంశాలను త్రిసభ్య కమిటీ అజెండాలో ఉదయం పేర్కొని, సాయంత్రం తొలగించడం గర్హనీయం. సమావేశపు అజెండాను కూడా తయారు చేయలేని అసమర్థ మోదీ ప్రభుత్వం దేశాన్ని పాలించడం దేశ ప్రజల కర్మ’’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు.
ఇలా ఉండగా, ‘‘ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ నాయకులు డ్రామాలాడుతున్నారు. జీవీఎల్, సోము శకుని పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు’’ అని మంత్రి పేర్ని నాని విమర్శించారు.
కేంద్ర హోంశాఖ ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాలో పెట్టడంపై బీజేపీ నేత జీవీఎల్ ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను అజెండాలో పెట్టారని తెలిసిన తరువాత చంద్రబాబు ఎందుకు సహకరించలేదని ఆయన నిలదీశారు.