తెలంగాణలో డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే 10 సంవత్సరాల్లో ఎంప్లారు మెంట్, మాదక ద్రవ్యాలు ప్రధాన సమస్యలుగా మారబోతున్నాయని హెచ్చరించారు.
కరోనా సమయంలో అనేకమంది విద్యార్ధులు గంజాయికి అలవాటు పడ్డారనిఆయన తెలిపారు. వీరిలో కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా డ్రగ్స్, గంజాయి లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో పిల్లల పట్ల తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించినట్లు సిపి తెలిపారు. ఇప్పటికే వెయ్యి మంది పోలీసులతో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మాదక ద్రవ్యాలు అమ్మిన కొన్న కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఇలా ఉండగా, డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లలో 250 మందికిపైగా ప్రముఖులు పట్టుబడ్డారు. పోలీసులు చర్యలతో రీహాబిలిటేషన్ సెంటర్‌కి ప్రముఖుల క్యూ కడుతున్నారు. డీ ఆడిక్షన్ సెంటర్లో సినీ ప్రముఖులు కౌన్సిలింగ్ తీసుకున్నారు.
డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలు, ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. కొకైన్, ఐఎస్డీ, ఎండీఎంఏ లాంటి డ్రగ్స్‌కి ప్రముఖులు బానిసలయ్యారు. డ్రగ్స్‌కి బానిసైనవారు ఏడాది పాటు డీ ఆడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. రీహాబిలిటేషన్ సెంటర్ల ద్వారా పొందిన సర్టిఫికెట్తో కోర్టులో ప్రముఖులకు ఊరట దొరికింది. నాలుగేళ్లలో 250 మందికి న్యాయస్థానం ఇమ్యూనిటీ ఇచ్చింది.
మరోవంక, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, తీసుకోవడంపై అబ్కారీ శాఖ రూల్స్ మరింత స్ట్రిక్ట్ చేసింది. అధికారులు గతంలో లేని విధంగా ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం వందల మందిని బైండోవర్ చేస్తున్నారు. బాండ్‌పేపర్ పూచీకత్తు కాలపరిమితిని ఏడాది నుంచి రెండేండ్లకు పెంచారు. ఫైన్ కూడా ఇప్పుడున్న లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచారు.
డ్రగ్స్, గంజాయి గురించి తెలిసీ సమాచారం చెప్పకపోయినా కేసులు నమోదు చేస్తున్నారు. శాటిలైట్ఫొటోల ద్వారా గంజాయి సాగు వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు.
రాష్ట్రంలో అనేక చోట్ల గుట్టుగా గంజాయి సాగు జరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు వ్యవసాయ శాఖ, అబ్కారీ శాఖ కలిసి పనిచేస్తున్నారు. టెక్నాలజీతోపాటు గ్రామాల్లో ఉన్న ఏఈవోల సాయం తీసుకుంటున్నారు. శాటిలైట్ఫొటోల ద్వారా ఎక్కడ గంజాయి సాగు జరుగుతుందో కనిపెడుతున్నారు.
ఇక గంజాయి తీసుకోవడం, సాగును ప్రోత్సహించినా, సాగు, రవాణా విషయం తెలిసినా పోలీసులు, అబ్కారీ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వకున్నా.. సదరు వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక రైతుబంధుతోపాటు ఇతర పథకాలు వర్తించవని హెచ్చరిస్తున్నారు.