దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా భావించి ఐఐటి, ఎన్ఐటీ లలో అడ్మిషన్లు పొందడం చాల కష్టం కాగలదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే కొద్దీ సంవత్సరాలుగా దేశంలో ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతూ వస్తుండడంతో ఇటువంటి ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశం కోసం పెద్దగా విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. దానితో భారీ సంఖ్యలో విద్యార్థులు చేరకపోవడంతో సీట్లు మిగిలి పోతున్నాయి.
గత రెండేళ్లలో వివిధ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో వివిధ కోర్సుల్లో 10,000 సీట్లు ఖాళీగా ఉన్నాయని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో 8,700 సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత వారం రాజ్యసభలో తెలిపారు.
డేటా ప్రకారం, 2020-21లోఐఐటిలలో 5,484 సీట్లు భర్తీ కాలేదు. వాటిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో (బీటెక్) 476 సీట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 3,229 సీట్లు, పీహెచ్డీ కోర్సుల్లో 1,779 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
2021-22లో, ఐఐటిలలో ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్య 5,296, ఇది మునుపటి సంవత్సరం కంటే కొంచెం తక్కువ. వాటిలో బీటెక్ కోర్సుల్లో 361, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 3,083, పీహెచ్డీ కోర్సుల్లో 1,852 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఇక, ఎన్ఐటీలలో, 2020-21లో వివిధ కోర్సుల్లో 3,741 సీట్లు ఖాళీగా ఉండగా, 2021-22లో ఈ సంఖ్య 5,012కి పెరిగింది. వాటిలో, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులలో గరిష్టంగా సీట్లు భర్తీ చేయబడవు, అంటే 2020-21లో 2,487, 2021-22లో 3, 413.
“ఐఐటిలు,ఎన్ఐటీలు, ఐఐఐటి లు వంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు సైన్స్ టెక్నాలజీ విషయాలలో విద్య, పరిశోధనలను అందిస్తాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుగా వీటిని వర్గీకరించారు. ఈ సంస్థల్లో వివిధ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్లు ర్యాంకింగ్/ఇతర పారామితుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు మాత్రమే అందిస్తారు. వారు అవసరమైన అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తారు” అంటూ మంత్రి ఖాళీలు ఎక్కువగా ఉండడానికి కారణాలు చెప్పే ప్రయత్నం చేసారు.