ఒక వంక బిజెపి, కాంగ్రెస్ నేతలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తలమునకలై ఉండగా, మరోవంక బిజెపి, కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రులు మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా సమీకృతం కావడంకై వ్యూహాత్మకంగా సమీకృతం అవుతున్నారు. అయితే నేరుగా కేంద్రంపై దండెత్తకుండా, కేంద్రం నియమించిన గవర్నర్లకు వ్యతిరేకంగా గొంతెత్తడం కోసం సమరానికి సిద్ధమవుతున్నారు.
వరుసగా ప్రధాని మోదీపై గళం విప్పుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తో పాటు ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నాయి. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది.
గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ, అధికార దుర్వినియోగంపై చర్చించేందుకు ప్రతిపక్ష రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు త్వరలో ఢిల్లీలో సమావేశం కానున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ట్వీట్ చేశారు. ఈ సమావేశాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించినట్లు తెలిపారు.
‘బిజెపి యేతర పాలిత రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగ ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగంపై మమతా బెనర్జీ నాకు స్వయంగా ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని ఆమె సూచించారు’ అని ట్వీట్ చేశారు.
రాష్ట్ర నిర్ణయాధికారాలను నిలబెట్టేందుకు డిఎంకె కట్టుబడి ఉంటుందని ఆమెకు హామీనిచ్చానని, త్వరలో దీనిపై సమావేశం జరగనుందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌తో ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగిన తర్వాత స్టాలిన్ నుండి ఈ ట్వీట్ వచ్చింది.
శనివారం బెంగాల్ అసెంబ్లీని జగదీప్ నిలిపి వేయడంపౖౖె స్టాలిన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి .. ఇలా చేయడం సరైనది కాదంటూ, ఆయన చర్య సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై గవర్నర్ సైతం స్టాలిన్‌కు బదులిచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు.
దీనిపై తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ… గవర్నర్ తన సొంత నిర్ణయం మేరకు అసెంబ్లీ నిలుపుదల చేయలేదని, కేబినేట్ సిఫార్సు మేరకు అసెంబ్లీని వాయిదా వేశారంటూ, అందులో ఎటువంటి గందళగోళం లేదని స్పష్టం చేశారు.
అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మమత బెనర్జీ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని మమతా వెల్లడించారు. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్తామని మమత స్పష్టం చేశారు. ఇదివరకే చెన్నై వెళ్ళినప్పుడు స్టాలిన్ ను కలసిన కేసీఆర్ త్వరలో ముంబై వెళ్లి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ను కలవనున్నట్లు వెల్లడించారు. మరోవంక, మమతా కేసీఆర్ ను కలవడం కోసం హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తున్నది.