మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వెలుగులోకి సిబిఐ ఛార్జిషీట్ వైసిపి వర్గాలలో కలకలం రేపుతున్నది. ఒక పధకం ప్రకారం, రూ 40 కోట్ల సుపారీ ఇచ్చి, `రాజకీయంగా అడ్డు తొలగించుకోవడం’ కోసమే హత్య చేయించారని స్పష్టం చేస్తున్నది.
ఇందులో ముఖ్యమంత్రికి సన్నిహితుడు, మరో బాబాయ్ కుమారుడు, కడప ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి కూడా నిడుతుండే అని సిబిఐ స్పష్టం చేసింది. ఆ వైషయమై ఇంకా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. అందుకనే `కీలక సూత్రదారులు’ను కాపాడటం కోసం ముఖ్యమంత్రి సిబిఐ దర్యాప్తును ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నారా? అని అనుమానాలకు ఈ చార్జిషీట్ దారితీస్తుంది.
గత ఏడాది అక్టోబర్ 26న వేసిన ఛార్జిషీట్‌తో పాటు ఐదవ నిందితునిగా దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి సంబంధించిన వివరాలను పొందు పరుస్తూ 2022 జనవరి 31నపులివెందుల కోర్టులో సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. శంకర్ రెడ్డి వైసిపి రాష్ట్ర కార్యదర్శి కాకుండా, అవినాష్ కు సన్నిహిత అనుచరుడు కావడం గమనార్హం.
వివేకానంద రెడ్డి ‘గుండెపోటుతో మరణించారు’ అని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డే తొలుత ప్రచారం చేశారని సీబీఐ తేల్చి చెప్పింది. గతనెల 31వ తేదీన మరో నివేదికను కోర్టుకు సమర్పించింది. దీని ప్రకారం… వివేకా గుండెపోటుతో మరణించారనే తప్పుడు ప్రచారం వెనుక అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని స్పష్టం చేసింది.
‘‘అప్పటికి బాత్రూమ్లో… రక్తపు మడుగులో వివేకానంద రెడ్డి మృతదేహం పడి ఉంది. డి.శంకర్ రెడ్డితో కలిసి ఎంపీ అవినాశ్ రెడ్డి అక్కడికి వచ్చారు. ఆయన గుండెపోటుతో మరణించారనే కధనాన్ని అప్పటికప్పుడే మొదలుపెట్టారు. ఈలోపు వైఎస్ భాస్కర్ రెడ్డి (అవినాశ్ రెడ్డి తండ్రి), వైఎస్ మనోహర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. గుండెపోటుతో మరణించారని ప్రచారం చేయడంపై అందరూ చర్చించుకున్నారు” అని చార్జిషీట్ లో పేర్కొన్నారు.
గంగిరెడ్డి, శంకర్ రెడ్డి మరికొందరితో కలిసి పనివాళ్లతో బెడ్రూమ్లో, బాత్రూమ్లో రక్తపు మరకలను శుభ్రం చేయించారు. వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా చక్కగా కట్లు కట్టించి అంబులెన్స్‌లో పులివెందుల ఆస్పత్రికి తరలించారని కూడా సీబీఐ తెలిపింది. ఈ హత్య కేసులో అవినాశ్ రెడ్డిని అనుమానితుడిగా పేర్కొంది.
‘‘కడప ఎంపీ టికెట్ తనకు లేదా వైఎస్ షర్మిలకు, అదీకాకపోతే వైఎస్ విజయమ్మకు దక్కాలని వివేకానందరెడ్డి గట్టిగా చెప్పేవారు. వైఎస్ అవినాశ్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని భావించేవారు. ఈ నేపథ్యంలో… తనకు సన్నిహిత అనుచరుడైన డి.శంకర్‌రెడ్డితో అవినాశ్ రెడ్డే ఈ హత్య చేయించారనే అనుమానం ఉంది. అయితే ఈ కోణంలో ఇంకా దర్యాప్తు సాగుతోంది’’ అని సీబీఐ పేర్కొంది.
పక్కా ప్రణాళిక ప్రకారమే వివేకా హత్య జరిగినట్లు సీబీఐ స్పష్టం చేసింది. ఆయనకు బాగా సన్నిహితులు, పరిచయస్తులైన ఎర్ర గంగిరెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డ్రైవర్ షేక్ దస్తగిరి ఈ కుట్ర పన్నినట్లు తెలిపింది. 2019 మార్చి 10 గంగిరెడ్డి నివాసంలోనే వివేకా హత్యకు ప్రణాళిక రచించినట్లు వెల్లడించింది. ఇందుకు రూ.40 కోట్లకు డీల్ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
రాజకీయంగా తమ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నారనే అడ్డు తొలగించుకున్నారని తెలిపింది. ఈ హత్యకు బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ సహా 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కారణమని, తమ రాజకీయ ఎదుగుదలకు వివేకా అడ్డుగా ఉంటాడని ఆయన్ను అడ్డు తొలగించుకునే కుట్రలో భాగంగానే హత్య జరిగిందని సీబీఐ అందులో స్పష్టంగా తెలిపింది.
శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి.. వివేకా ఇంటికి చేరుకుని హత్యకు సంబంధించిన ఆధారాలు తొలగించాలని చూశారే తప్ప.. వివేకా కుమార్తెకు సమాచారం ఇవ్వలేదు. ఆమె లేకుండానే మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారు. తప్పుడు సమాచారం, అసంపూర్తి సమాచారంతో ఎంవీ కృష్ణారెడ్డి ద్వారా ఫిర్యాదు చేయించి దానినే ఎఫ్ఐఆర్గా నమోదు చేయాలని సీఐ శంకరయ్యను శివశంకర్‌రెడ్డి బలవంతం చేశారని చార్జిషీట్ లో వివరించారు.