తరగతి గదుల్లో హిజాబ్‌లు ధరించడం నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించిన ఉడిపికి చెందిన బాలికల నివాస చిరునామాలతో సహా వారి వ్యక్తిగత వివరాలను భారతీయ జనతా పార్టీ కర్ణాటక యూనిట్ ట్వీట్ చేసింది.ముస్లిం బాలికల వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పెట్టడంపై విమర్శలు రావడంతో బీజేపీ పార్టీ ఇంగ్లీషు, కన్నడ భాషల్లోనూ చేసిన ట్వీట్లను తొలగించింది.
కేసు వేసిన బాలికలు ఐదురుగు మైనర్లని పేర్కొంటూ వారి చిరునామాలు, ఇతర వివరాలు ట్వీట్ లలో ఇస్తూ, కాంగ్రెస్ మైనర్ బాలికలను రాజకీయాలకోసం వాడుకొంటున్నట్లు బిజెపి మండిపడింది .
ట్విట్టర్లో, బిజెపి రాష్ట్ర విభాగం పిటిషనర్ల వివరాల చిత్రాలను వారి చిరునామాలతో సహా పోస్ట్ చేసింది. “లడ్కీ హూ లడ్ శక్తి హూన్” అంటే ఇదేనా, @ప్రియాంకగాంధీ?” అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ లు ఇచ్చింది. అయితే ఈ ట్వీట్ లపై దుమారం చెలరేగడంతో ,కన్నడ, ఇంగ్లీష్ లలో ఇచ్చిన ట్వీట్ లను ఉపసంహరించుకొంది.
“#HijabRowలో పాల్గొన్న విద్యార్థులలో ఐదుగురు మైనర్లు. మైనర్ బాలికలను రాజకీయాల్లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఎలాంటి అపరాధభావం లేదా? ఎన్నికల్లో గెలవడానికి ఎంత దిగజారిపోతారు?’’ అని బిజెపి నిలదీసింది.
అయితే బిజెపి ట్వీట్ పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడుతూ ట్వీట్‌ను “సున్నితత్వం, అనారోగ్యం, దయనీయమైనది” అని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌ను తీసివేయమని ట్విట్టర్‌ని కోరారు.
“సిగ్గులేని బిజెపి కర్ణాటక ప్రతిపక్షాలపై దాడి చేయడానికి మైనర్ బాలికల చిరునామాలను ట్వీట్ చేస్తుంది. ఇది ఎంత సున్నితత్వం, అనారోగ్యం, దయనీయమైనదో మీకు తెలుసా?” అని ఎంపీ ట్వీట్లో ప్రశ్నించారు.
“నేను @DgpKarnataka , @TwitterIndia చర్య తీసుకోవాలని, ట్వీట్‌ను తీసివేయమని అభ్యర్థిస్తున్నాను. @GoI_MeitY జోక్యాన్ని కూడా కోరండి,” అని ఆమె రాసింది.
డిసెంబరులో కొంతమంది విద్యార్థులు హిజాబ్ ధరించి ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలకు రావడం ప్రారంభించడంతో హిజాబ్‌పై వివాదం మొదలైంది. దీనికి నిరసనగా కొందరు హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించారు.
ఈ సమస్య రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని ఇతర విద్యాసంస్థలకు వ్యాపించింది కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థ సంస్థలకు మూడు రోజుల సెలవులు ప్రకటించింది. గత సోమవారం నుండి పాఠశాలలను మాత్రమే తిరిగి తెరిచారు.
ఇలా ఉండగా, హిజాబ్ తొలగించేందుకు నిరాకరిస్తూ 13 మంది విద్యార్థులు కర్ణాటకలో పరీక్షలు రాయకుండా వెనుతిరిగారు. ఉడుపి, శివమొగ్గ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలకు కొంతమంది విద్యార్థులు హిజాబ్‌తో వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు హిజాబ్ తొలగించాల్సిందేనంటూ ఉపాధ్యాయులు సూచించారు.
ప్రత్యేక గదిని కేటాయిస్తామని, అక్కడ హిజాబ్ తొలగించి పరీక్షలు రాయాలని అనడంతో విద్యార్థులు తిరస్కరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారిని వాపసు తీసుకువెళ్లారు. కాగా, కర్ణాటక రాష్ట్రంలో బుధవారం నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి.
హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటకలోని బాగల్ కోట్, బెంగళూరు, చిక్కబళ్లాపూర్, గదగ్, షిమోగ, తూమ్ కూర్, మైసూరు, ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ ను విధించారు. శివమొగ్గ నగరంలో హిజాబ్ వివాదం నేపథ్యంలో ఎస్ఎస్ఎల్సీ ప్రాథమిక పరీక్షలను ముస్లిం విద్యార్థినులు బహిష్కరించారు.మరో వైపు కర్ణాటక హైకోర్టు హిజాబ్ వివాదంపై దాఖలైన కేసును విచారించనుంది. కళాశాలల వద్ద ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇలా ఉండగా, కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో ఇస్లామిక్ సహకార సంఘం (ఓఐసీ) చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు ప్రేరేపితమని, తప్పుదోవపట్టించేవని తెలిపింది. భారత దేశ వ్యతిరేక ఎజెండాతో ఓఐసీని స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరుస్తున్నారని మండిపడింది.