కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో తాజాగా రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్లో రూ.87 కోట్ల స్కామ్ వెలుగుచూసింది. కార్పొరేషన్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యాయి. ఈ ఏడాది మార్చిలో అక్రమ మార్గంలో నిధులు ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తున్నది.
ఈ కుంభకోణంలో ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి బీ నాగేంద్ర హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్టీ కార్పొరేషన్లో పనిచేసే అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొన్న నేపథ్యంలో ఈ స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది.
చంద్రశేఖర్ ఆత్మహత్య నోట్లో మంత్రి నాగేంద్రతో పాటు పలువురు కార్పొరేషన్ ఉన్నతాధికారుల పేర్లను ప్రస్తావించారు.
తన చావుకు కార్పొరేషన్ ఎండీ జేజీ పద్మనాభం, అకౌంట్స్ ఆఫీసర్ పరుశురాం దురుగన్నవర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సుచిస్మిత రావల్ కారణమని చంద్రశేఖర్ తన సూసైడ్ నోట్లో రాశాడు.
ఎస్టీ కార్పొరేషన్‌కు స్థానిక ఎంజీ రోడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఖాతా ఉన్నది. దాని నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అదే బ్యాంకు ఇతర బ్రాంచ్‌లకు రూ.87 కోట్లు బదిలీ అయినట్టు సమాచారం. ఈ డబ్బు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల ఖాతాలకు వెళ్లినట్టు తెలుస్తున్నది. ఈ స్కామ్ ఆరోపణలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.
ఎస్టీ కార్పొరేషన్లో స్కామ్‌ను మంత్రి బీ నాగేంద్ర మంగళవారం ధ్రువీకరించారు. అయితే తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ఆయన నిరాకరించారు. తనకు ఈ స్కామ్‌లో ఎలాంటి పాత్ర లేదన్నారు.