గత వారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు 19 శాతం వరకు తగ్గాయని , మరణాల రేటు నిలకడగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత వారం ప్రపంచం మొత్తం మీద కరోనా కొత్త కేసులు కేవలం 16 మిలియన్ వరకే నమోదయ్యాయని, 75,000 మరణాలు సంభవించాయని వివరించింది.
పశ్చిమ పసిఫిక్ రీజియన్లో మాత్రం 19 శాతం వరకు కొత్త కేసులు పెరిగాయని, ఆగ్నేయాసియాలో 37 శాతం వరకు భారీగా కేసులు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. పశ్చిమపసిఫిక్ రీజియన్లో మూడోవంతు మరణాలు పెరగగా, మధ్యప్రాచ్యంలో 38 శాతం వరకు పెరిగాయని డబ్లుహెచ్వొ తన నివేదికలో తెలియజేసింది.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతుండడంతో రష్యాలో అత్యధికంగా కొత్త కేసులు పెరగడం కనిపిస్తోందని, తూర్పు ఐరోపాలో కూడా ఇటీవల రెట్టింపు సంఖ్యలో కేసులు పెరగడమైందని పేర్కొంది.
ఆల్ఫా, బీటా, డెల్టా తదితర కరోనా వేరియంట్ల వ్యాప్తి తగ్గుముఖం పట్టడా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోందని, గతవారం ప్రపంచ వ్యాప్తంగా 4, 00,000 కన్నా ఎక్కువగా వైరస్ జన్యుక్రమాలను పరిశీలించగా, 98 శాతం కన్నా ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంటే బయటపడిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది.
ఒమిక్రాన్ బిఎ2 రకం నిదానంగా పెరుగుతోందని, దక్షిణాఫ్రికా, డెన్మార్క్, బ్రిటన్ తదితర దేశాల్లో దీని వ్యాప్తి పెరుగుతోందని వివరించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన ఆఫ్రికా డైరెక్టర్ డాక్టర్ మాట్షిడిసో మొయెటీ కరోనా పరిస్థితిని వివరిస్తూ వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్నా గతవారం ఈ ఖండంలో కాస్త వెలుగు కనిపించిందని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా కరోనా తీవ్రత నుంచి క్రమంగా కోలుకుంటోందని వివరించారు. అయితే ఈ ఆశావాదానికి బిన్నంగా డబ్లుహెచ్వొ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ హెచ్చరికలు చేశారు. కరోనా అంతిమం ఆసన్నమైందని దేశాలు అనుకోవడం అకాలమైన ఆలోచనే తప్పమరేమీ కాదని, ఈ మహమ్మారి ఇంకా ఎక్కడా అంతం కాలేదని హెచ్చరించారు.