పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఎన్నికల ర్యాలీలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీలకుచెందిన “భయ్యా”లను రాష్ట్రంలోకి రానివ్వవద్దని పేర్కొంటూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పంజాబ్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న బిజెపి, ఆప్ నేతలను ఉద్దేశించి ప్రజలను కోరడం ద్వారా వివాదాస్పదమైంది.
ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలను ఉద్దేశించి “భయ్యాలు” అనే పదాన్ని ఉపయోగించడం సాధారణంగా అభ్యంతరకరంగా పరిగణిస్తారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలో, మంగళవారం రూప్‌నగర్‌లో రోడ్‌షోలో చన్నీ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పక్కన చప్పట్లు కొడుతూ కనిపించారు.
కాగా, చన్నీ వాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. యూపీ, బీహార్ ప్రజలను సీఎం అవమానించారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను అవమానించారని ధ్వజమెత్తారు. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను పబ్లిక్ గూండాలని అన్నారని, అఖిలేశ్ యాదవ్ ఆమెకు పెద్ద పెద్ద పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారని మండిపడ్డారు.
ఉత్తర ప్రదేశ్‌ను అవమానించే పనిని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ చేపట్టాయా? అని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలను గూండాలుగా పేర్కొనడాన్ని వీరంతా ఎలా సమర్థిస్తారని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు.
ఉత్తర ప్రదేశ్ ప్రజలు అనేక రాష్ట్రాలు, దేశాలకు వెళ్తూ, తమ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నారన్నారు. చన్నీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వంటివారు ఆ మంచి పేరును చెడగొడుతున్నారని ఆయన ఆరోపించారు.
“ప్రియాంక గాంధీ పంజాబ్ కోడలు. ఇక్కడ పాలించటానికి వచ్చిన ‘ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ భాయి’లను రాష్ట్రంలోకి రానివ్వరు” అని పంజాబ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అంటూ చన్నీ చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది.
ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలను “చాలా సిగ్గుచేటు” అని పేర్కొన్నారు. చన్నీ వ్యాఖ్యలపై వ్యాఖ్యానించమని విలేకరుల సమావేశంలో అడిగినప్పుడు “ఏ వ్యక్తి లేదా ఏదైనా నిర్దిష్ట సమాజంపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” అని ఆయన బదులిచ్చారు.
చన్నీ తన చర్మపు ఛాయపై గతంలో తనను ‘కాలా (చీకటి)’ అని పిలిచేవాడని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ప్రియాంక గాంధీ కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారేనని భగవంత్ మాన్ చెప్పినప్పుడు, ఆమె కూడా “భయ్యా” అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
బీజేపీ నేత తేజస్వి సూర్య ట్విట్టర్లో చన్నీ వీడియోను పంచుతూదీనిపై ప్రియాంక గాంధీ వాద్రాను లక్ష్యంగా చేసుకొని మండిపడ్డారు. “ప్రియాంక వాద్రా జీ తనను తాను ఉత్తరప్రదేశ్ కుమార్తెగా పిలుచుకుంటోంది. పంజాబ్‌లో ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలను అవమానిస్తునప్పుడు ఆమె చప్పట్లు కొట్టారు. ఇది ఆమె ద్వంద్వ పాత్ర, ముఖం కూడా” అని సూర్య విమర్శించారు.