పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తర్వాత ఇప్పుడు మరో వైసిపి సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నాయకత్వంపై బహిరంగ తిరుగుబాటు ప్రకటించారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన జిల్లాల విభజన ప్రతిపాదనలు అశాస్త్రీయంగా ఉన్నాయని మండిపడుతూ, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో ఏ విధంగా నామరూపాలు లేకుండా పోయింది, ఇప్పుడు జిల్లాల విభజన విషయంలో సహితం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే వైసిపికి కూడా అంతే జరుగుతోందని హెచ్చరించారు.
ప్రస్తుతం వైసిపి ఎమ్యెల్యేగా ఉన్న ఆయన నెల్లూరు జిల్లాలోనే రాపూరు, కలువాయిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఉన్న రాపూరు మండలం జిల్లాల పునర్విభజనలో తిరుపతి జిల్లాలోకి చేరింది. దీనిని నిరసిస్తూ గురువారం రాపూరులో ఎంపీపీ చెన్ను బాలకృష్ణారెడ్డి ఆద్వర్యంలో మండల ప్రజాప్రతినిధులు చేపట్టిన ఒక్కరోజు నిరాహారదీక్షలో ఆనం పాల్గొని ప్రసంగించారు.
‘‘అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా తీవ్రంగా నష్టపోయింది. మా (ఆనం) కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేయాలన్న దురుద్దేశంతో నియోజకవర్గ విభజన చేసిన ఓ నేతకూ అదే గతి పట్టింది. ఇప్పుడు జనం మాట వినకుండా జిల్లా విభజన చేస్తే అధికార పార్టీకి కూడా అదే పరిస్థితి వస్తుంది’’ అని ఆనం స్పష్టం చేశారు.
జిల్లాల విభజనలో శాస్త్రీయత పాటించకుండా ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే అధికార పార్టీకి కూడా నష్టం జరగక తప్పదని పరోక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుడూ పునర్విభజన వల్ల జరిగే నష్టాన్ని తెలిపేందుకే దీక్ష చేస్తున్నానని తెలిపారు.
వెంకటగిరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపడం వల్ల తీవ్రనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో స్వార్థరాజకీయం కోసం.. కాంగ్రెస్‌లోని ఓ పెద్దమనిషి రాపూరు, కలువాయి వాసులకు ద్రోహం చేశారని విమర్శించారు.
‘‘ఒక పార్లమెంటు స్థానం ఒక్కో జిల్లా కేంద్రం అన్నారు. అయితే సర్వేపల్లి మాటేమిటి.. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న ఆ అసెంబ్లీ స్థానం నెల్లూరు జిల్లాలోనే ఎలా ఉంది. దీనికి రాష్ట్ర, జిల్లా అధికారులు సమాధానం చెప్పాలి. నెల్లూరు జిల్లా రాపూరు ఉండేందుకు మరో పోరాటానికి సిద్ధం కావాలి.’’ అని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం పిలుపిచ్చారు.
రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల కోసమే ఈ దీక్షలు చేపట్టి తమ నిరసనను తెలియజేస్తున్నట్లు చెప్పారు. “తిరుపతి పార్లమెంటు స్థానంలో ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం మాత్రం నెల్లూరు జిల్లాలోనే ఎలా ఉంచారో జిల్లా, రాష్ట్ర అధికారులు సమాధానం చెప్పాలి. ఈ పాపం అధికారులదేనా? వెంకటగిరి నియోజకవర్గలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను సర్వేపల్లి మాదిగిరినే నెల్లూరులోనే ఉంచాలి. లేకుంటే మరోసారి పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి.’’ అని పిలుపునిచ్చారు.
కండలేరు జలాశయం కోసం తాను పది రోజులపాటు ఆమరణ దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. మూడు మండలాలను నెల్లూరులో ఉంచకుంటే అలాంటి పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా అధికార యంత్రాంగం తమ ఇష్టానుసారం ప్రవర్తించడం అన్యాయమని రామనారాయణరెడ్డి దుయ్యబట్టారు.
సోమశిల, కండలేరు జలాల కేటాయింపులే ఇంత వరకు జరగలేదని గుర్తు చేశా రు. నాగార్జున సాగర్ లాంటి దుస్థితి సోమశిల ప్రాజెక్ట్‌కు వచ్చే పరిస్థితి ఉందని హెచ్చరించారు.