పంజాబ్‌లోకి యూపీ, బీహారీలను రానివ్వబోమన్న తన వాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో పంజాబ్ ముఖ్యమంత్రి చరణజిత్ సింగ్ చన్నీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అంటూ సంజాయిషీ ఇచ్చారు. పంజాబ్ ప్రతి ఒక్కరిదీ అని పేర్కొంటూ, నిజానికి తాను ఆ వాఖ్యాలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఉద్దేశించి చేశానని చన్నీ వివరణ ఇచ్చారు.
మరోవైపు చన్నీ కామెంట్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. చన్నీ ఉద్దేశం అది కాదని, ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె చెప్పారు. పంజాబ్‌ను పంజాబీలు మాత్రమే పాలించాలన్నదే చన్నీ ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు.
అయితే ఆ మాటల్ని కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. యూపీ, బీహార్ నుంచే కాదు ఎవరైనా ఎక్కడి నుంచైనా పంజాబ్ కు రావచ్చని ప్రియాంక చెప్పారు.
ఇదిలా ఉంటే చన్నీ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చన్నీ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ చప్పట్లు కొట్టడాన్ని తప్పుబట్టిన ప్రధాని.. కాంగ్రెస్ విధానం ఇదేనా అని ప్రశ్నించారు. సంత్ రవిదాస్ ఉత్తర ప్రదేశ్‌లోని కాశీకి చెందినవారని, గురు గోవింద్ సింగ్ బిహార్‌లోని పాట్నాకు చెందినవారని, వీరిని కూడా పంజాబ్‌కు రానివ్వరా? అంటూ ప్రధాని సూటిగా ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ అభిమతం అని అడిగారు. కాంగ్రెస్ తన బండి నడవడం కోసం ఎల్లప్పుడూ ఒక ప్రాంత ప్రజలను మరొక ప్రాంతంపై ఎగదోస్తూ ఉంటుందని దుయ్యబట్టారు.
పంజాబ్ ముఖ్యమంత్రి బుధవారం ఏం చెప్పారో యావత్తు దేశం విన్నదని చెప్పారు. ఢిల్లీ కుటుంబం, చన్నీ యజమాని (ప్రియాంక గాంధీ) చప్పట్లు కొట్టారని గుర్తుచేశారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఎవరిని అవమానిస్తున్నారని ప్రధాని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ నుంచి వచ్చిన ప్రజలు చెమటోడ్చి పని చేయని గ్రామం పంజాబ్‌లో ఏదీ లేదని స్పష్టం చేశారు.
సంత్ రవిదాస్ జయంతిని బుధవారం జరుపుకున్నామని, ఆయన ఎక్కడ జన్మించారో చెప్పాలని కాంగ్రెస్ నేతలను అడుగుతున్నానని నిలదీసేరు. ఆయన పంజాబ్‌లో జన్మించారా? అని ప్రశ్నించారు. ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించారన్నారు. ఆయన పంజాబ్‌లో అడుగుపెట్టకూడదని మీరు అంటారా? అని ప్రశ్నించారు. ఆయన పేరును మీరు తుడిచేస్తారా? అన్నారు. ఏం భాష మాట్లాడుతున్నారు మీరు? అని అడిగారు.
‘గురు గోవింద్ సింగ్ ఎక్కడ జన్మించారని అడుగుతున్నాను. ఆయన పాట్నాలో జన్మించారు. కాబట్టి ఆయనను మీరు అగౌరవపరుస్తారా? అని ప్రశ్నించారు. గురు గోవింద్ సింగ్ జన్మించిన గడ్డను మీరు అవమానిస్తున్నారు’’ అని మోదీ అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని కనీసం ఒక క్షణమైనా పంజాబ్‌ను పరిపాలించనివ్వకూడదని ప్రధాని స్పష్టం చేశారు.