ఉగాది నుండి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని పట్టుదలతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండడంతో, జిల్లాల విభజనకు సంబంధించిన పక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. విస్తృతంగా సమావేశాలు నిర్వహించడంతో పాటు, ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి దిశా నిర్ధేశం చేస్తున్నారు.
దీంతో జిల్లాల్లో కూడా ఈ దిశలో పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ల ఏర్పాటుకు సంబంధించి భవనాల గుర్తింపు ప్రక్రియ జోరుగా సాగుతోంది. అనేకచోట్ల ప్రతిపాదిత జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే రెండు, మూడు భవనాలను గుర్తించి నివేదికలను పంపినట్లు తెలిసింది.
వీటిని పరిశీలించి జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకున్న తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. కలెక్లర్ల నివేదికలతో పాటు, ప్రత్యామ్నాయ నివేదికలను కూడా ప్రభుత్వం తెప్పించుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే అభ్యంతరాలను, సలహాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర కేంద్రానికి చేర్చాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరిగేందుకువీలుగా ఇప్పటికే నిర్ధారించిన షెడ్యూల్లో మార్పులు చేసింది. గతంలో రూపొందించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 15వ తేదిలోగా తుది నోటిఫికేషన్లు ప్రకటించాలని కలెక్టర్లకు సూచించిన ప్రభుత్వం తాజాగా మార్చి 23 నుండి 25 వ తేదిలోగా తుది నోటిఫికేస్లను జిల్లా గెజిట్‌లో ప్రకటించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి రోజువారి ప్రణాళికను కూడా జిల్లాలకు పంపింది.
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లా, మండల పరిషత్‌ల విభజన కూడా ముందుకొచ్చింది. వీటికి సంబంధించి తెలంగాణలో అనుసరించిన విధానాన్ని పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో 10 జిల్లాలను 35 జిల్లాలుగా విభజించి పాలన సాగిస్తును నేపథ్యంలో అక్కడ పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల విషయంలో ఏం చేశారో పరిశీలించడానికి పురపాలక శాఖ కమిషనర్, పంచాయితీరాజ్ శాఖల అధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ అధ్యయన నివేదికను సమర్పించాల్సి ఉంది. సాధ్యమైనంత త్వరలోనే ఈ నివేదిక వస్తుందని భావిస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగుల విభజన, పోస్టుల బదలాయిరపులు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు వంటి అరశాల్లో కూడా తెలంగాణ అనుభవాలను పరిశీలించనున్నారు.
పాత, కొత్త జిల్లాల మధ్య పంచాల్సిన అస్తుల వివరాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. కలెక్టరేట్ల కోసం ప్రతిపాదిత నూతన జిల్లాలో భవనాలు గుర్తించే ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు. వీటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిఉంది.
మరోవైపు చరాస్తుల వివరాలను సేకరిరచి, వాటిని సిఎఫ్‌ఎస్‌ఎస్ (సెరటర్ ఫర్ సిస్టమ్స్ సర్వీసెస్)లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ చరాస్తులను కొనసాగే, విభజిత జిల్లాలకు ఎలా పంపకాలు చేయాలన్న దానిపై నివేదికలు కోరారు. దీనిపై జిల్లాల కలెక్టర్లు కూడా నివేదికలు సిద్ధం చేస్తున్నారు.