ఆమె ఒకప్పుడు భారత స్టాక్ మార్కెట్ ను ఉజ్వల స్థాయికి తీసుకెళ్లడంలో ఖ్యాతి గడించారు. ఆమె ఏ పదవి చేపట్టినా సంచలనాత్మక ఫలితాలు సాధిస్తూ వచ్చారు. జాతీయస్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఇ)కి సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్‌గా 2013 నుండి 2016 కీలక పాత్ర వహించారు.
అయితే తాజాగా స్టాక్మార్కెట్లో అవతవకలు జరగడంతో పాటు సెబీ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో సిబిఐ ఆమెపై విచారణ చేపట్టడంతో పాటు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీచేయడంతో ఒక్కసారిగా భారత ఆర్ధిక రంగం నివ్వెరపోయింది.
పైగా, హిమాలయాలలో ఉండే ఒక `అదృశ్య బాబా’ తనను గత 20 ఏళ్లుగా నడిపిస్తున్నారని, ఆయనే అన్ని విషయాలలో తనకు సలహాలు ఇస్తున్నారని అంటూ ఆమె పొంతనలేని మాటలు చెబుతూ ఉండడంతో అంతా చిత్రవిచిత్రంగా మారిపోయింది.
హిమాలయ యోగితో మాజీ ఎన్ఎస్ఇ సిఇఒ చిత్ర రహస్య సమాచారాన్ని పంచుకునే వారని ఇటీవల మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చెప్పడంతో ఆమెపై వార్తలు పతాక స్థాయిలో హల్చల్ చేశాయి.
రెండు రోజుల క్రితం పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె నివాసంపై ఐటి దారులు జరిపింది. ముంబైలో ఆమెకు చెందిన గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, అడ్వైజర్ ఆనంద్ సుబ్రమణ్యన్ ప్రాంగణంలో కూడా సోదాలు నిర్వహించింది. తాజాగా సిబిఐ ఆమెను ప్రశ్నించింది.
అంతకుముందు ఫిబ్రవరి 11న సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చిత్రపై రూ.3 కోట్ల జరిమానా విధించింది. అంతర్గత రహస్య సమాచారాన్ని ఎవరో తెలియని వ్యక్తితో పంచుకున్నందుకు చిత్రపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ చర్య తీసుకుంది.
ఈ తెలియని వ్యక్తి లేదా యోగి ఒక ఆధ్యాత్మిక శక్తి అని, అది ఆయన కోరుకున్న చోట కనిపించవచ్చని ఆమె చెప్పారు. సెబీ ప్రకారం, ఆమె నిర్వహణ నిర్మాణం, డివిడెండ్ స్థితి, ఆర్థిక ఫలితాలు, హెచ్ఆర్ పాలసీ, రెగ్యులేటర్ ప్రతిస్పందన వంటి సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తితో పంచుకున్నారు. అయితే సెబీ, దర్యాప్తు సంస్థలు `అదృశ్య వ్యక్తి’ కాదని, అతనెవరో ఆమెకు తెలుసని, కానీ తెలపడం లేదని బలంగా అనుమానిస్తున్నాయి.
ఎన్ఎస్ఇలో సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో చాలా రిగ్గింగ్ జరుగుతోందంటూ 2015లో ఒక విజిల్‌బ్లోయర్ సెబీకి కో-లొకేషన్ స్కామ్ గురించి ఫిర్యాదు చేసింది. కో-లొకేషన్ స్కామ్ అంటే రహస్య సమాచారం పబ్లిక్‌గా మారే ముందు కొంత మంది వ్యక్తులు లేదా బ్రోకర్లతో షేర్ చేయడం.
ఈ సమాచారం ఈక్విటీ మార్కెట్లో డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో చిత్ర పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆ సమయంలో చిత్రకు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సెబీ ఇటీవల తన విచారణను పూర్తి చేసిన తర్వాత నివేదికను పంచుకుంది.
చాలా సంవత్సరాలుగా యోగి కోరిక మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. హిమాలయాల్లో ఉండే ఒక రహస్య యోగిని ఎవరో తెలియదు. యోగి కథ పూర్తిగా చిత్రమైనది. ఈ కథ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం:
1. చిత్రా రామకృష్ణ చార్టర్డ్ అకౌంటెంట్, 2013లో చిత్ర ఎన్ఎస్ఇకి మొదటి మహిళా ఎండి, సిఇఒగా ఎంపికయ్యారు. చిత్ర 2013లో ఫోర్బ్ ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికయ్యారు. 2016లో తన పదవికి రాజీనామా చేశారు.
2. చిత్ర ఆమె పనిచేసే సమయంలో భారీ ప్యాకేజీతో ఆనంద్ సుబ్రమణ్యంను నియమించుకుని, ప్రమోషన్ కూడా ఇచ్చారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం ఫిబ్రవరి 11న సెబీ రామకృష్ణపై రూ.3 కోట్ల జరిమానా విధించింది సెబీకి విచారణలో ఆమె, తాను హిమాలయాలకు చెందిన ఒక రహస్య యోగి సలహా మేరకే నిర్ణయాలు తీసుకునేవాడినని చెప్పారు.
3. ఆనంద్ సుబ్రమణ్యం 2013 ఏప్రిల్ 1న చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 2015 ఏప్రిల్ 1న గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. అతను 2016 అక్టోబర్ వరకు ఈ పదవిలో కొనసాగాడు. ఎన్ఎస్ఇలో చేరడానికి ముందు, బాల్మెర్ అండ్ లారీలో ఆనంద్ జీతం సంవత్సరానికి 15 లక్షలు, కానీ ఎన్ఎస్ఇలో అతనికి రూ. రూ.1.38 కోట్ల భారీ ప్యాకేజీ ఇచ్చారు. 2016 నాటికి ప్యాకేజీని 4.21 కోట్లకు పెంచారు. ఆనంద్ సుబ్రమణ్యం నియామకం సమయంలో హెచ్ఆర్ శాఖను కూడా సంప్రదించలేదు. ఆనంద్ సుబ్రమణ్యంపై యోగి రూ.2 కోట్ల జరిమానా విధించారు.
4. హిమాలయ యోగి ఎవరో తెలియదు, బాబా ఇమెయిల్ ఐడి మాత్రమే కనుగొన్నారు. ఏ ఉద్యోగి ఎన్ని రేటింగ్స్ ఇవ్వాలి, ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి అని చిత్ర ఆ నిరాకార బాబాని ఇమెయిల్ ద్వారా అడిగేవారు. ఎన్ఎస్ఇ కీలక సమాచారం బాబాతో పంచుకున్నారు.