రాష్ట్రంలో మదరసాలలో ప్రభుత్వ జోక్యం ఉండదని కారాన్తక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. హైకోర్టులో హిజాబ్ వివాదం సాధ్యమైన త్వరగా పరిష్కారం కావాలని ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతూ హిజాబ్ వివాదం కారణంగా హైస్కూళ్లు, పీయూసీ విద్యాసంస్థల్లో విద్యార్థుల విద్యార్జనకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతుండటం చాలా బాధగా ఉందని చెప్పారు.
పరీక్షల వేళ ఇలాం టి పరిణామాలు విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిణామమేనని చెప్పారు. ఈ వివాదం సమసిపోయి విద్యాసంస్థల్లో మళ్లీ సాధారణ స్థితిగతులు నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల్లో సామరస్యం, ఐక్యత వెల్లివిరియాల్సి ఉందని, చిన్నారుల మనసులో విషం నింపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లోనూ సాధ్యమైనంతవరకు ఈ వివాదం లేకుండా చూడాల్సిందిగా విద్యాశాఖాధికారులను ఆదేశించామని తెలిపారు. మైనార్టీల హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
హిజాబ్‌కు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను 95 శాతం మంది విద్యార్థులు గౌరవించి అమలు చేస్తున్నారని, కేవలం 5 శాతం మంది విద్యార్థుల పట్టుదల కారణంగానే సమస్య జఠిలంగా మారిందని సీఎం చెప్పారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
కాగా ప్రభుత్వ పాఠశాలల్లోగానీ, ప్రభుత్వ నిర్వహణలోని ఉర్దూ పాఠశాలల్లోగానీ మదరసా విద్యను బోదించే ఆలోచన ప్రభుత్వానికి లేదని బొమ్మై స్పష్టం చేశారు. న్నారు. వక్ఫ్‌బోర్డు నిర్వహణలోని మదరసాల ఆధునికీకరణకు, మౌలిక సదుపాయాల కల్పనకు తలా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు గ్రాంట్లను విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో గుర్తింపు పొందిన మదరసాలు 622 ఉన్నాయని, వీటికి మాత్రమే సాయం అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. మదరసాలకు సంబంధించినంత వరకు ముస్లింల మతపరమైన విద్యకు పూర్తిస్వేచ్ఛ ఉందని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోజాలరని సీఎం తేల్చి చెప్పారు.
గొడవ కారకులను అరెస్టు చేయండి
ఇలా ఉండగా, హిజాబ్ వేయించేందుకు, తొలగించేందుకు ఎవరు కళాశాలల వద్దకు వస్తారో వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి రాష్ట్రప్రభుత్వానికి సూచించారు.. విద్యార్థులను కళాశాలలకు చేర్చుకోవాలని, అనవసరంగా వారిని రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఆదేశాలను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే తరహాలో వదిలితే అంతిమతీర్పును పాటించరన్నారు. కఠినచర్యలకు ప్రభుత్వం సిద్ధం కావాలని సూచించారు. కాంగ్రెస్‌కు ఆందోళన చేయడమే విధిగా మారిందని మండిపడుతూ భవిష్యత్తులోనూ వారు అలాగే కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కొనసాగుతున్న నిరసనలు
కాగా, రాష్ట్రమంతటా హిజాబ్‌పై నిరసనలు కొనసాగాయి. హైకోర్టు ధర్మాసనం హిజాబ్‌పై సమగ్ర విచారణలు కొనసాగిస్తుండగా మరోవైపు ఆందోళనలు నిరంతరమయ్యాయి. శుక్రవారం తుమకూరు, చిత్రదుర్గ, బెళగావి, యాదగిరి, విజయపుర, చిక్కమగళూరు, బళ్లారితోపాటు పలు జిల్లాల్లో హిజాబ్లతోనే విద్యార్థినులు పాఠశాలలకు హాజరయ్యేందుకు వచ్చారు.
అధ్యాపకులు వారిని కట్టడి చేయాల్సిన పరిస్థితి కొనసాగింది. దీంతో పాఠశాలల ప్రాంగణంలో 144వ సెక్షన్‌ను పలు జిల్లాలు అమలు చేశాయి. హిజాబ్ మాహక్కు అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసన కొనసాగించారు. చిత్రదుర్గ , విజయపురతోపాటు పలు చోట్ల విద్యార్థులకు ప్రత్యేకంగా హైకోర్టు నిబంధనలు పా టించాల్సి ఉందని వివరించినా ఫలితం లేకపోయింది. రాష్ట్రమంతటా ఆందోళనలు కొనసాగాయి.