వ్యవసాయంలో సాంకేతికను తీసుకువస్తామని చెప్పిన కేంద్రం ఆ దిశగా అడుగులు వేసింది. 100 కిసాన్ డ్రోన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో 100 కిసాన్ డ్రోన్లను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.వీటిని వివిధ ప్రాంతాల్లో పురుగుల మందు పిచికారీ చేయడానికి, వ్యవసాయ సామాగ్రిని తరలించేందుకు వీటిని వినియోగించనున్నారు.
రైతులకు సహాయపడే లక్ష్యంతో.. పొలాల్లో పురుగుల మందు పిచికారి చేసేందుకు కిసాన్ డ్రోన్ల కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత వ్యవసాయరంగంలో ఈ కార్యక్రమం ఓ సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.
డ్రోన్ రంగంలో పెరుగుతున్న భారత్ సామర్థ్యాన్ని .. ప్రపంచానికి నూతన నాయకత్వాన్ని అందిస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతుల కోసం ఇది అద్భుతమైన, ఉత్సాహమైన చొరవగా అభివర్ణించారు. దేశంలో డ్రోన్ల స్టార్టప్‌లు అభివృద్ధి చెందనున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం అవి 200 ఉండగా.. త్వరలో వేలల్లోకి చేరుకుంటాయని తెలిపారు. రాబోయే రెండేళ్లలో గరుడ ఏరోస్పేస్ ఆధ్వర్యంలో లక్ష డ్రోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని వెల్లడించారు.
వీటి వల్ల భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల కల్పనకు దారి తీస్తుందని ప్రధాని తెలిపారు. ఈ రంగం అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగం ఎదుగుదలకు ఇప్పటికే అనేక సంస్కరణలు, విధానపమమైన చర్యలు తమ ప్రభుత్వం చేపట్టిందని మోదీ పేర్కొన్నారు.
కొన్నేళ్ల క్రితం వరకు డ్రోన్లు అనగానే రక్షణ రంగానికి చెందినవని ప్రధాని గుర్తు చేశారు. 21వ శతాబ్దంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం సరికొత్త అధ్యయనమని చెప్పారు. ఇది యువతకు ఉపాధి అవకాశాలను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని రైతులు టెక్నాలజీని అందుపుచ్చుకోవాలని చెబుతూ వ్యవసాయానికి టెక్నాలజీ తోడైతే అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు.