రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ నూతన డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గౌతం సవాంగ్ నుంచి 6వ డిజిపిగా ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం లా అండ్ ఆర్డర్ డిజి రవిశంకర్ అయ్యన్నార్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ మత ఉద్రిక్తతలు రెచ్చగొడితే ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా మతానికి సంబంధించిన సున్నితమైన సమస్యలు వస్తే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ప్రజల సహకారంతో పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తామని, ప్రతిష్టను పెంచుతామని ఆయన చెప్పారు. రాయలసీమలో ఎర్రచందనం అక్రమ రవాణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో గంజాయి సాగు నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పోలీసులందరూ రాజ్యాంగ బద్దంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారను ఆరోపణలను ప్రస్తావించగా విధులు నిర్వహించే సమయంలో కొనిుసార్లు పొరబాట్లు దొర్లుతుంటాయని అంగీకరించారు. ఉద్దేశ్యపూర్వకంగా చేశారా? లేక పొరబాటు జరిగిందా? అనుది చూడాలని సూచించారు. నిర్దిష్ట ఆరోపణలపై విచారణ చేస్తామని, వాస్తవాలుంటే చర్యలు తప్పవని డిజిపి హెచ్చరించారు.
మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, గూండాయిజంపై వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీలను ఆదేశిస్తున్నట్లు ఆయన చెప్పారు. అణగారిన వర్గాలపై దాడులు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఆందోళనల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీస్‌శాఖలో సిబ్బంది సర్థుబాటు అంశంపై లా అండ్ ఆర్డర్ డిజి రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేస్తోందనిడిజిపి రాజేంద్రనాధ్‌రెడ్డి తెలిపారు.
ఏయే జిల్లాలకు ఎంత మంది సిబ్బంది అవసరమవుతారు? ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు ప్రస్తుతం ఉన్న వారు ఎంతమంది? అవసరమైన సిబ్బంది ఎంతమంది? సర్థుబాటు ఎలా అనే అంశాలపై అధ్యయనం జరుగుతోందని వివరించారు.
అంతకుముందు మంగళగిరి ఆరవ బెటాలియన్‌లో మాజీ డిజిపి గౌతంసవాంగ్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ పోలీసుల వ్యవహారశైలిలో మార్పులకు కృషి చేశానని, ప్రజలకు పోలీస్ వ్యవస్థను చేరువ చేసేందుకు పనిచేశానని చెప్పారు. శాంతి భద్రతల సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతూ రెండేళ్ల 8నెలలు డిజిపిగా కొనసాగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు.
విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.