పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి కొద్దీ గంటల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసు కేసు నమోదైంది. అకాలీదళ్, ఇతర రాజకీయ పార్టీలను దూషించారన్న ఆరోపణలపై పంజాబ్ ఎన్నికల పోలింగ్ అధికారి విచారణకు ఆదేశించారు.
ఈ క్రమంలో కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దూషించినట్లు ఒక వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంపై ఆయా పార్టీ నేతలు కేజ్రీవాల్‌పై పంజాబ్ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మరోవైపు శనివారం సాయంత్రంతో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసినప్పటికీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇంటింటి ప్రచారం నిర్వాహించారంటూ కేసు నమోదైంది. చన్నీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి, పంజాబీ గాయకుడు శుభ్ దీప్ సింగ్ పైనా కూడా కేసు నమోదు చేశారు.
ఇలా ఉండగా, కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ నేత కుమార్ విశ్వాస్ కు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు హోం శాఖ ప్రకటించింది. కుమార్ విశ్వాస్‌కు ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత కల్పించినట్టు హోం శాఖ తెలిపింది. కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి లేదంటే ఖలిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.