గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు 72 గంటల పాటు ఎన్నికల సభలు, సమావేశాలు, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని కూడా రాజాసింగ్‌పై నిషేధం విధించింది.
యూపీ ఓటర్లను బెదిరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసినా రాజాసింగ్ స్పందించలేదు. వివరణ ఇచ్చేందుకు శనివారం మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చినా ఆయన నుంచి సమాధానం రానందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
రాజాసింగ్ చెప్పుకునేందుకు ఏమీ లేదని భావిస్తున్నామని, అందుకే ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పింది. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో యూపీలో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల తర్వాత యోగికి ఓటేయనివారిని గుర్తించి వారి ఇళ్లను బుడ్జోజర్లతో కూలుస్తామని హెచ్చరిక చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై ఫిర్యాదు అందడంతో ఎలక్షన్ కమిషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో కేసు నమోదుచేయాలని ఆదేశించింది.
ఇంతకు ముందు జారీ చేసిన నోటీసులపై ఆయన తరఫు న్యాయవాది కే ఆంథోనీరెడ్డి ఈసీని సంప్రదించి.. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు కావాలని కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
మరోసారి గడువు ముగిసిన నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఆయన న్యాయవాది నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఈసీ తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో రికార్డింగ్‌ను పరిశీలించామని, ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా, భయపెట్టేలా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.