మేడారం సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం వైభవంగా శనివారం సాయంత్రం ముగిసింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేశారు. డప్పులు, డోలువాయిద్యాల మధ్య అమ్మవార్లను వనంలోకి తీసుకెళ్లారు పూజారులు. గద్దెలపై ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత భారీ పోలీసు బందోబస్తు మధ్య అమ్మవార్లను వనప్రవేశానికి తీసుకెళ్లారు. చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ.. పూనుగొండ్లకు సమ్మక్క భర్త పడిగిద్దరాజు, కొండాయికి గోవిందరాజులను తరలించారు.
గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి పూజలు చేశారు. అమ్మవార్ల దీవెనలు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన రాక సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలిగితే క్షమించాలని గవర్నర్ కోరారు.
తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే మేడారం గిరిజన జాతర విజయవంతంగా ముగిసిందని జాతర పరిశీలకులుగా ఉన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రటించారు. తల్లుల రాకకు ముందే దాదాపు 60లక్షల మంది భక్తులు మేడారనికి వచ్చారని జాతర సమయంలో 60 నుండి 70 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారని తెలిపారు. ఈ ఏడాది దాదాపుగా కోటి 20 నుండి 35 లక్షల భక్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని రీతిగా జాతర నిర్వహించుకున్నామని తెలిపారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జాతర ప్రతిష్టత , గౌరవం పెంచేలా అధికార యంత్రాంగం పనిచేసిందని వారు ప్రశంసించారు. జాతర కు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తల్లుల దర్శనం కలిగించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
కాగా, మేడారం జాతరకు జాతీయ పండుగగా కేంద్రం ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. జాతరకు విశేషంగా నిధులు తీసుకు రావడంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు. 8 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకసారి కూడా ఎందుకు మేడారం రాలేదని ఎర్రబెల్లి విస్మయం వ్యక్తం చేశారు.
జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ మేడారం జాతరకు ఎందుకు రాలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సమ్మక్క పోరాట స్ఫూర్తిని, తెలంగాణ అత్మగౌరవాన్ని సీఎం కించపరిచారని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి మేడారం సమ్మక-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముచ్చింతల్ కు వచ్చిన ప్రధాని మోదీ మేడారం ఎందుకు రాలేదని విస్మయం వ్యక్తం చేశారు. సీఎం, పీఎం కలిసి మేడారం జాతరను చిన్నగా చూపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
కాగా, మేడారం జాతర నిర్వహణలో విజయవంతం అయ్యామని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణాదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, పోలీసులతో పాటు జిల్లాలోని అన్ని శాఖలు బాగా సహకరించాయని పేర్కొ న్నారు. కరోనా వైరస్ విజృంభన తర్వాత జరిగిన ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
ఆఖరిరోజు భక్తులు పోటెత్తారు. అమ్మవార్లకు చీరె, సారెలు, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల ప్రాంగణం,జంపన్నవాగు పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు నృత్యాలు, తీన్మార్ స్టెప్పులతో అడవంతా మార్మోగింది. ఆదివాసీలు, గిరిజనుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.