ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు వేగం పుంజుకొంటున్న కొద్దీ అధికార పక్షంలో కలకలం రేగుతున్నది.
సిబిఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్ లో కడప ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో అధికార పక్షంలో విబేధాలు ఈ హత్యకు దారితీసిన్నట్లు పేర్కొనడంతో అనుమానాలు ముఖ్యమంత్రికి సన్నిహితుడైన మరోబాబాయి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సిబిఐ దృష్టి సారించినట్లు స్పష్టం అవుతున్నది.
ఈ సమయంలో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ టిడిపి నేతలు ఆరోపిస్తూ, ముఖ్యమంత్రిని కూడా సిబిఐ విచారించాలని సూచిస్తుండడం రాజకీయ దుమారం రేపుతున్నది. వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సీఎం జగన్‌రెడ్డేనని, జగన్‌తో పాటు అతని కుటుంబసభ్యులను సీబీఐ విచారించాలని టిడిపి నేత మాజీమంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఎంపీ అవినాష్‌రెడ్డిని సానుభూతితో గెలిపించుకునేందుకు వివేకాను హత్య చేసి సొంత మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆరోపణలు చేశారని ఆయన ఆరోపించారు. వివేకా కుమార్తె పోరాటంతో నిజాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. సీబీఐ నిష్పక్షపాతంగా విచారించి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవంక, వివేకా హత్య కేసు నిందితులే సీబీఐని బ్లాక్మెయిల్ చేస్తున్నారని మరో టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. వివేకా హత్య.. అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చేసిందేనని సీబీఐ స్పష్టంగా కోర్టుకు తెలిపిందని పేర్కొన్నారు. సాక్ష్యాలను తారుమారు చేశామని వైసీపీనే చెబుతోందని తెలిపారు.
సీఎం జగన్ మార్చి 19, 2019న సీబీఐ విచారణ కావాలని హైకోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. కానీ, సీఎం అవ్వగానే ఫిబ్రవరి 6, 2020న కేసు వెనక్కి తీసుకున్నారని పేర్కొంటూ కేసు వెనక్కి తీసుకున్నది అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు కాదా? అని బోండా ఉమ ప్రశ్నించారు. వివేకా హత్యకేసులో వైసీపీ నేతల ప్రమేయం సాక్ష్యాలతో బయట పడినా సీఎం జగన్ ఇంతవరకూ ఎందుకు నోరుమెదపలేదని ఆయన నిలదీశారు.
ఇలా ఉండగా, వివేకా హత్య కేసు దర్యాప్తులో.. సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతోందని మంత్రి బాలినేని తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన హత్యతో.. ఎవరికి సంబంధం ఉంటుందో అర్ధం చేసుకోవాలని కోరారు. హత్య జరిగినప్పుడే అప్పటి సీఎం చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ వేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. హత్యతో టీడీపీవారికి సంబంధం ఉంటుందని భయపడే చంద్రబాబు సీబీఐతో దర్యాప్తు చేయించలేదని బాలినేని ఆరోపించారు.