బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్ కుమార్ తన ఇంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కుమార్ తో `విందు సమావేశం’ జరపడం, ఇద్దరు సుమారు రెండు గంటల సేపు సమాలోచనలు జరపడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది.
ఈ సమావేశం యధాలాపంగా జరిగిన్నట్లు ఇద్దరు చెబుతున్నప్పటికీ లోతైన రాజకీయ వ్యూహం ఇమిడి ఉండవచ్చని సర్వత్రా భావిస్తున్నారు. ఢిల్లీలో ఇద్దరూ విందు సమావేశంలో పాల్గొన్న విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ నితీష్‌కుమార్ ధ్రువీకరించారు. ప్రశాంత్ కిషోర్‌తో తనకు పాత అనుబంధం ఉందని, అంతేతప్ప ఈ సమావేశం వెనుక ఏవో ఉద్దేశాలు ఊహించుకోవద్దని నితీష్ స్పష్టం చేశారు.
నితీష్ కుమార్ ఒమెక్రాన్ ఇన్ఫెక్షన్తో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఫోనులో అడిగి తెలుసుకున్నానని, ఒకసారి ముఖాముఖిగా కలుసుకుందామని నితీష్ అనడంతో సమావేశమైనట్టు ప్రశాంత్ కిషోర్ వివరించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తమకన్నా తక్కువ సీట్లు వచ్చినా నితీష్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ, అప్పటి నుండి ప్రభుత్వంపై అన్నివిధాలా ఆధిపత్యం వహించే ప్రయత్నం చేస్తుండడంతో నితీష్ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ప్రతికూల ఫలితాలు ఎదురైతే, ఆ పార్టీకి ఝలక్ ఇవ్వడానికి సిద్దపడుతున్నారా? అనే అనుమానాలు ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఆర్ జె డి నేత తేజస్వి యాదవ్ ఇప్పటికే బిజెపిని వదిలి వస్తే తాము నితీష్ కుమార్ ప్రభుత్వంకు మద్దతు ఇస్తామని ప్రకటించడం గమనార్హం.
ఏది ఏమైనప్పటికి బిజెపికి రాజకీయంగా ఒక సందేశం ఇవ్వడం కోసమే వీరిద్దరూ కలిసిన్నట్లు స్పష్టం అవుతున్నది.
2020 లో పార్టీ సభ్యత్వం నుంచి ప్రశాంత్ కిషోర్‌ను నితీష్ తొలగించిన తరువాత ఉభయులూ సమావేశం కావడం ఇదే ప్రథమం. ఢిల్లీ లోని నితీష్ అధికారిక నివాసంలో ఇరువురూ సుమారు 2 గంటల సేపు సమావేశమయ్యారు. నితీష్ బిజెపితో తిరిగి పొత్తు ఏర్పర్చుకోవడంతోనే ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి.
పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ సారధ్యం లోని టిఎంసి తిరిగి ఘన విజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన బాగా పనిచేసింది. నితీష్‌కుమార్ జనతాదళ్ యునైటెడ్ విజయం కోసం గతంలో వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే నితీశ్, పీకె మధ్య తరువాత సంబంధాలు క్షీణించడంతో ప్రశాంత్ కిషోర్‌ను ఆ పదవి నుంచి నితీష్ తొలగించారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో నితీష్‌తో తనకున్న అనుబంధం గురించి పీకే మాట్లాడుతూ తాను తిరిగి కలసి పనిచేయాలనుకుంటున్న కొద్దిమంది నేతల్లో నితీష్ ఒకరని చెప్పడం గమనార్హం.