వైసీపీ పాదయాత్ర చేసింది మటన్, చేపలు అమ్ముకోవడానికా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పాదయాత్రలో మత్స్యాకారులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.వైసీపీకి అధికారం ఇచ్చింది మటన్ కొట్లు, చికెన్ కొట్లు నడపమని కాదని పవన్ కళ్యాణ్ హితవు చెప్పారు.
నరసాపురంలో జనసేన పార్టీ నిర్వహించిన మత్య్సకారుల అభ్యున్నతి సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న లక్షన్నర మంది మత్స్యకారులకు గుదిబండగా మారిందని పవన్ విమర్శించారు.దోపిడి చేసే చట్టాలను పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
జనసేనకు కనీసం 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే 217 జీవో వచ్చేది కాదని స్పష్టం చేశారు. 217 జీవో పేపర్లను చింపేసిన పవన్.. మత్స్యకారుల కోసమే ఈ పనిచేశానని చెప్పారు. జీవోను చించినందుకు తనను జైలుకు పంపితే వెళతానని చెప్పారు. చట్టాలను తాను నమ్ముతానని కానీ ఇబ్బంది పెట్టే చట్టాలను ఉల్లంఘిస్తానని వెల్లడించారు.
చిన్న వలతో సముద్రంలోకి వెళ్లేందుకు ఎంతో ధైర్యం ఉండాలన్న పవన్.. వారి సాహసమే తనకు స్ఫూర్తి అని తెలిపారు. లేని సమస్యలను సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్ధండులని ఎద్దేవా చేశారు ఏటా 25 వేల మంది మత్స్యకారులు ఏపీ నుంచి గుజరాత్ కు వలస వెళ్తున్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు.
‘‘గంగవరం పోర్టులో జెట్టి నిర్మిస్తామని చేయలేదు. కాలుష్యం వల్ల అక్కడ మత్స్యకారుల జీవితాలు పాడైపోతున్నాయి. ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదనేదే వైసీపీ నాయకుడి విధానం. ఎంత పెద్ద వారైనా దేహిదేహి అని అడుక్కోవాలని అనుకుంటున్నారు. ఆయన ఇగో సంతృప్తి పడాలి. అది ఆయన నైజం” అంటూ విమర్శించారు.
వైసీపీ నాయకులకు భయపడొద్దని చెబుతూవారేమైనా దిగొచ్చారా? వైసీపీ ఎమ్మెల్యేలకు చట్టాలు వర్తించవా?. అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ప్రజలు అండగా ఉండాలని కోరుతూ లేకపోతే నేను ఏమీ చేయలేనని చెప్పారు.
‘మేం అధికారంలో వస్తే వారం రోజుల్లో 217 జీవోను రద్దు చేస్తాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల బతుకులు రోడ్డున పడ్డాయి. గత మూడేళ్లలో 63 మందికి మాత్రమే ప్రభుత్వం బీమా ఇచ్చింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని మా పార్టీ 45 మందికి రూ.5 లక్షల వంతున బీమా సాయం చేశాం. ఎన్నికల ముందు రూ.10 లక్షలు బీమా ఇస్తామని ప్రకటించి, కేవలం కేంద్రం ఇచ్చే రూ.5 లక్షలకే రాష్ట్రప్రభుత్వం పరిమితం చేస్తోంది’ అని విమర్శించారు.
రాష్ట్రప్రభుత్వం 217 జీవో నెల్లూరు జిల్లాకే పరిమితం చేస్తామంటూ ప్రకటించడం పచ్చి అబద్ధమని పవన్ తెలిపారు. మత్స్యకారులు ఉన్న తీర ప్రాంత జిల్లాలన్నింటికీ దీనిని అమలు చేస్తారని చెప్పారు. ‘ప్రభుత్వం వంద హెక్టార్లకుపైగా ఉన్న చెరువులను వేలం పాట నిర్వహించి అప్పగిస్తామంటోంది. దీనివల్ల పెద్ద వాళ్లకే ప్రయోజనం. ఆ జీవోను చూసి చెరువులను పాడుకునేందుకు బయటి వ్యక్తులు ఆన్లైన్ టెండర్లు వేసేందుకు రావొద్దు. ఒకవేళ మీరు దక్కించుకున్నా.. మేం అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తాం’ అని హెచ్చరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే ఈ తరహా జీవోలు లేవని.. కేవలం ఇక్కడే అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఏ స్థాయిలోనైనా పోరాడుతానని తేల్చి చెప్పారు. ఒక్క మాట మాట్లాడాలన్నా తాను చాలా ఆలోచించి మాట్లాడుతానని చెబుతూ ఓ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. వైసీపీ పిచ్చి వేషాలకు జనసేన భయపడదని స్పష్టం చేస్తూ సంయమనం తమ బలహీనత కాదని.. బలమని హెచ్చరించారు.
తాను భయపడేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. వంగి వంగి దండాలు పెట్టేందుకు రాజకీయాల్లోకి రాలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెన్షన్లు, ప్రభుత్వ సాయం రాదంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ బ్రాందీషాపు పక్కనే చీకుల కొట్టులు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.
తాను చావడానికైనా సిద్ధమే కానీ తలవంచేందుకు కాదని పవన్ తేల్చిచెప్పారు. ఏపీలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని చెబుతూ తాను రోడ్ షో చేస్తున్నప్పుడు రోడ్లన్ని గోతులమయంగా ఉన్నాయని, మాయాబజార్లో లాగా పడవలు ఊగుతున్నట్లు తాను వచ్చానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గోతుల మయం చేసిందని విమర్శించారు.
జనసైనికులు జెండా కడితే కేసులు పెడుతున్నారని, ఫ్లెక్సీ కడితే కేసు పెడతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉంటారు.. మీరు భయపడాల్సిన పనిలేదని కార్యకర్తలకు ఆయన హామీ ఇచ్చారు. బడా బాబుల కోసం 217 జీవో తీసుకువచ్చి మత్స్యకారుల పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లెక్కలు, ఇసుక మాఫియాలలాగానే, బడాబాబులకు మేలు చేయడానికి ఆ జీవో తీసుకువచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ సర్కారు ప్రారంభించే 6500 మత్స్య శాఖ స్టాల్స్‌లో ఎంతమంది మత్స్యకారులకు ఉద్యోగాలు ఇస్తారు? అని మనోహర్ ప్రశ్నించారు.