ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని గద్దె దింపి, అధికారం చేపట్టాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ప్రధాన ప్రచారకర్త, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో `వ్యూహాత్మక పొత్తు’ పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.
2017 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడం, రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగక పోవడంతో ఈ పర్యాయం అఖిలేష్ వ్యూహాత్మకంగా అధికారికంగా పొత్తులేకుండా కాంగ్రెస్ తో తెరవెనుక అవగాహనకు వచ్చిన్నట్లు చెబుతున్నారు. తద్వారా కాంగ్రెస్ కూడా లాభపడవచ్చని ప్రియాంక భావిస్తున్నారు.
గత ఏడాది ఒక విమాన ప్రయాణంలో అఖిలేష్, ప్రియాంక కలుసుకొని, పరస్పరం పలకరించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య తిరిగి పొత్తు ఉంటుందా అని మీడియా ప్రశ్నించినప్పుడు “భవిష్యత్ లో ఏమి జరుగుతుందో యెట్లా చెప్పగలం?” అంటూ ఆమె నర్మగర్భంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.
అఖిలేష్ పోటీచేస్తున్న స్థానంతో పాటు మరికొన్ని స్థానాలలో ఎస్పీ అభ్యర్థులపై కాంగ్రెస్ పోటీ పెట్టక పోవడం గమనార్హం. అదేవిధంగా కాంగ్రెస్ పోటీచేస్తున్న కొన్ని స్థానాలలో అఖిలేష్ కూడా అభ్యర్థులను పెట్టలేదు.
గత దశాబ్దకాలంగా యుపిలో `సింగల్ డిజిట్’ దాటలేక పోతున్న కాంగ్రెస్ కు గౌరవనీయంగా సీట్లు దక్కి, ప్రచార బాధ్యతలు చేపట్టిన ప్రియాంక `ఇమేజ్’ పెరిగేవిధంగా చేయడం కోసం కనీసం 25 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులపై అఖిలేష్ బలహీనమైన అభ్యర్థులను పెట్టారు.
అదేవిధంగా అసలు కాంగ్రెస్ ఎప్పుడు గెలుపొందని పలు స్థానాలలో ప్రియాంక సహితం నామమాత్రపు పోటీకి పరిమితమయ్యారు. తాము ఎట్టిపరిస్థితులలో గెలుపొందే అవకాశం లేదని భావిస్తున్న పలు నియోజకవర్గాలలో కేవలం బిజెపి అభ్యర్థి ఓట్లను చీల్చగల అభ్యర్థులను రెండు పార్టీలు ఎంపిక చేసిన్నట్లు కనిపిస్తున్నది.
రెండు పార్టీలు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకొని బిజెపిని ఓడించలేమని 2017లో వెల్లడి కావడంతో ఇప్పుడు `వ్యూహాత్మక పొత్తు’ ప్రయోగం చేయాలని వీరిద్దరూ కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే, 2024 లోక్ సభ ఎన్నికలలో దేశ వ్యాప్తంగా ఈ నమూనాను అమలు జరపాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ప్రతిరాష్ట్రంలో బిజెపియేతర పార్టీలతో అటువంటి అవగాహనకు రావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.