దాణా స్కామ్లో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు రాంచీ సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ 60 లక్షల జరిమానా కూడా విధించింది. రెండు దశాబ్దాల క్రితం బీహార్ లో సంచలనం రేపిన ఈ దాణా కుంభకోణంలో ఇది ఇదో కేసు కావడం గమనార్హం.
మొదటి నాలుగు కేసులలో సహితం ఆయనకు ఇప్పటికే శిక్ష పడింది. నాలుగు కేసులలో కలిపి 14 ఏళ్ళు శిక్ష పడగా, ఇప్పటికే మూడున్నరేళ్లు జైలులో ఉంది, ప్రస్తుతం అనారోగ్యంతో రాంచి ఆసుపత్రిలో ఉన్నారు.
ఈ శిక్ష పడగానే దేశంలో దాణ స్కాము కాకుండా మరే స్కామూ లేదా అని ఆయన కుమారుడు, బీహార్ లో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ప్రశ్నించడం ఆసక్తి రేపుతున్నది. ఎందుకంటె ఇంతవరకు దేశంలో మరే రాజకీయ నాయకుడికి ఇన్ని సంవత్సరాల జైలు శిక్ష పడలేదు.
మొత్తం ఒకటే కుంభకోణం అయినప్పుడు ఒకొక్క జిల్లాలో జరిగిన దానిని ఒక్కొక్క కేసుగా విభజించి, ఐదు కేసులుగా చేసి ఐదు శిక్షలు వేయడం కూడా స్వతంత్ర భారత దేశంలో మరెప్పుడు జరిగిన సందర్భాలు కూడా లేవు. అందుకనే ఈ జైలు శిక్షలు రాబోయే రోజులలో రాజకీయ ప్రకంపనాలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తేజస్వి వాఖ్యలు వచ్చిన కొద్దీ సేపటికి లాలూ ప్రసాద్ పై కేసు నమోదుచేయడం వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పడం గమనార్హం. ఆయన అపరాధభావంలో ఉన్నారా? అనే అనుమానం కలుగుతుంది. అప్పట్లో సమతా పార్టీ అధ్యక్షుడు జార్జ్ ఫెర్నాండెజ్ పిటిషన్పై సంతకం చేయమని కోరినా తాను నిరాకరించినట్లు ఆయన చెప్పారు.
కేసులు పెట్టాలనుకుంటే ఆ పని మీరే చేసుకోండని సూచించానని నితీశ్ తెలిపారు. దీంతో ఫెర్నాండెజ్ ఢిల్లీలో ఉన్న శివానంద్ తివారీని పాట్నాకు పిలిపించి ఫిర్యాదుపై సంతకం చేయించారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ శివానంద్ తివారీ లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలోనే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇలా ఉండగా, బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కారణంగానే లాలూ జైలుకు వెళ్లాల్సి వస్తోందని, ఒకవేళ కమల పార్టీకి అనుకూలంగా ఉండుంటే రాజా హరిశ్చంద్ర బిరుదు లభించేదని తేజస్వి ఎద్దేవా చేయడం గమనార్హం. దీర్ఘకాలంగా బిజెపికి వ్యతిరేక రాజకీయాలలో ఉంటున్న ప్రాంతీయ పార్టీ నేత కేవలం లాలూ మాత్రమే కావచ్చు. మిగిలిన వారంతా ఏదో ఒక సమయంలో బిజెపితో కలసి ఉన్నవారే.
నితీష్ కుమార్ బిజెపితో పొత్తు తెంచుకొని, ఆర్జేడీ తో కలసి ఎన్నికలలో పోటీ చేసి, గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ సందర్భంగా కీలక బిజెపి నాయకులు లాలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని కలసి నితీష్ తో పొత్తు తెచ్చుకొని బైటకు వస్తే, తమ మద్దతుతో తేజస్వి ముఖ్యమంత్రి కావచ్చని ప్రతిపాదించారు. అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు.
అయితే ఈ విషయం తెలిసిన లాలూ ఆగ్రహం చెందారు. బిజెపితో చేతులు కలిపితే తాను ఆత్మహత్య చేసుకొంటానని కుటుంభం సభ్యులను బెదిరించారు. ఆ తర్వాతను ఆయనకు వరుసగా జైలు శిక్షలు పడటం, ఆయన జైలుకు వెళ్లడం ప్రారంభమైంది. మరోవంక, నితీష్ కుమార్ ను దారిలోకి తెచ్చుకొని, తిరిగి ఎన్డీయేలో చేరేటట్లు బిజెపి చేసుకోగలిగింది.
మరోవంక, తాజా కోర్ట్ తీర్పు రాగానే, లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను రాంచీలోని రాజేంద్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ.. ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు.అంతేకాదు.. ఆయన బ్లడ్ షుగర్,రక్తపోటు హెచ్చుతగ్గులున్నాయని చెప్పారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు రిమ్స్ ఏడుగురు డాక్టర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. లాలూ మూత్రపిండాలతో పాటు పలు వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయనకు కిడ్నీల వ్యాధి స్టేజీ-4లో ఉండగా.. 20శాతం సామర్థ్యతో మాత్రమే పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు డాక్టర్ విద్యాపతి తెలిపారు.
లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రూ 950కోట్ల విలువైన దాణా స్కామ్ జరిగింది. 1996లో కేసు నమోదు కాగా 170 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో 55 మంది ఇప్పటికే మరణించారు. తాజా కేసు 139. 35 కోట్ల రూపాయలకు సంబంధించినది. ఈ కేసులో 36 మందికి మూడేళ్ల జైలుశిక్ష పడింది.