తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఉక్రెయిన్ను మూడు ముక్కలుగా చేసినట్లయింది. ఇప్పటికే ఉన్న ఉక్రెయిన్‌కు తోడు దొనెట్స్, లుహాన్స్ ప్రాంతాలు దేశాలుగా ఏర్పడినట్లు రష్యా ప్రకటించింది.
అంతటితో ఆగకుండా ఆ కొత్త దేశాల్లో సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు శాంతి పరిరక్షక దళాల పేరిట రష్యా సేనలను పంపించాలని ఆదేశించారు. అంతేకాదు ఉక్రెయిన్ ఉనికినే పుతిన్ ప్రశ్నించడం పశ్చిమ దేశాలను కలవరపెడుతోంది.
పుతిన్ అధ్యక్షతన సోమవారం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు ప్రత్యేక దేశాలుగా గుర్తింపు ఇవ్వాలని అధ్యక్షుడిని కోరారు. అదే సమయంలో ఉక్రెయిన్ దళాలు అక్కడ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు.
2014లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటు ప్రాంతాల స్వాతంత్య్రాన్ని రష్యా గుర్తించినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పొస్కోవ్ తెలిపారు. ఈ వేర్పాటువాద ప్రాంతాలు స్వాతంత్య్రం ప్రకటించుకున్న తర్వాత దాదాపు 8 ఏళ్ల పాటు సాగిన పోరులో ఉక్రెయిన్ తిరిగి ఈ ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించింది.
అయితే ఈ పోరులో 14,000 మందికి పైగా ప్రజలు మరణించారు. ఉక్రెయిన్ పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిందని పుతిన్ జాతీయ టెలివిజన్‌లో ప్రసంగిస్తూ ఆరోపించారు. ఉక్రెయిన్‌కు అసలు ఎప్పుడూ సొంత దేశ హోదా లేదని, దానికి ఎప్పుడూ స్థిరమైన రాజ్యాధికారం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ సొంతంగా అణ్వాయుధాన్ని తయారు చేయగలదని, దానికి పశ్చిమ దేశాలు సాయం చేసే అవకాశం ఉందని, అదే అసలైన ముప్పని కూడా పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ నరమేధానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దీంతో ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి దీన్ని ఒక సాకుగా చూపించే అవకాశముందని పశ్చిమ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
రష్యా చర్యలపై మండిపడుతున్న నాటో దేశాలు ఆ దేశంపై పలు ఆంక్షలు విధించాయి.ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించిన దేశాల్లో ఐరోపా సమాఖ్య, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలున్నాయి. ఉక్రెయిన్నుంచి వేర్పడిన దొనెట్స్, లుహాన్స్ ప్రాంతాలతో అమెరికా ఎటువంటి వ్యాపారాలు చేయకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.