భారత దేశంలోనే భారీ జనసందోహం పాల్గొనే పండుగలలో ఒకటైన తెలంగాణాలో అతిపెద్ద పండుగ మేడారం జాతరకు హాజరైన గవర్నర్ డా. తమిళశై సౌందరాజన్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించడం పట్ల కేంద్రం సీరియస్ అవుతున్నట్లు తెలుస్తున్నది. మావోయిస్టులు ప్రాబల్యం గల అటవీ ప్రాంతంలో ఆమె రోడ్ మార్గంలో వెళ్ళవలసి రావడం, ప్రభుత్వ అధికారులు ఆమెను పట్టించుకొనక పోవడం గురించి కేంద్ర నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టిన్నట్లు చెబుతున్నారు.
మేడారం జాతరలో గవర్నర్ తమిళిసైకి ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా హాజరై ఆహ్వానించాల్సి ఉన్నా, వారు గైర్హాజర్ కావడం వివాదానికి కేంద్ర బిందువైంది. మేడారం ముగింపు రోజు శనివారం ఉదయం 11.15 నిమిషాలకు గవర్నర్ మేడారం వెళ్తారని, హెలికాప్టర్ సమకూర్చాలని గవర్నర్ కార్యాలయం కోరినా, దానిని సమకూర్చకపోవడంతో గవర్నర్ మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి చేరుకున్నారు.
స్వాగతం, వీడ్కోలు కార్యక్రమాలకు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ గైర్హాజరు కావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వేర్వేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయితే అదేరోజు కాస్త ముందుగా సీఎం కేసీఆర్ జాతరకు వెళ్తున్నారని, ప్రభుత్వం వద్ద ఉన్నది ఒక హెలికాప్టర్ మాత్రమేనని, అందుకే దానిని సమకూర్చలేమని ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
సీఎం హెలికాప్టర్లో మేడారం వెళ్తారనే సమాచారం ముందుగానే ఇచ్చారని, ఆ తర్వాతే గవర్నర్ కార్యాలయం హెలికాప్టర్ కోరిందని ఆ వర్గాలు తెలిపాయి. గవర్నర్ కార్యాలయం ముందు ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం, కరోనా పేరుతో జనవరి 26 వేడుకలను రాజ్‌భవన్‌కు మాత్రమే పరిమితం చేయడం వంటి విషయాలపై ప్రభుత్వం, గవర్నర్‌కు కొంతకాలంగా మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.
మహాజాతరలో చివరి ఘట్టమైన దేవతల వనప్రవేశం రోజున(19న) దర్శనానికి గవర్నర్ ముందుగానే షెడ్యూల్ ఇచ్చారు. గవర్నర్ పర్యటనకు కొద్దిగంటల ముందే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఇతర అధికారులు మేడారం ‘సక్సెస్ మీట్’నిర్వహించారు.
తర్వాత మేడారం చేరుకున్న గవర్నర్ తమిళిసైకి జాయింట్ కలెక్టర్ ఇలాత్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు. మావోయిస్టుల ప్రాబల్యప్రాంతంలో గవర్నర్ పర్యటనను తేలికగా తీసుకోవడంపై కేంద్రం విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.