పలు బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియమించిన గవర్నర్లతో ఘర్షణకు తలబడుతుంటే, సిపిఎం అగ్రనేత అయిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాత్రం నేరుగా గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ను కలసి ఆయనతో తన ప్రభుత్వంకు ఏర్పడిన పలు వివాదాలను పరిష్కరించుకోవడం కేరళ సిపిఎం నాయకుల మధ్య కలకలం రేపుతున్నది.
గవర్నర్ తో ఘర్షణకు దిగి మధ్య తరగతి, విద్యావంతులైన ప్రజల దృష్టిలో అపఖ్యాతి పాలు కావడంకన్నా, సర్దుబాటు ధోరణి ప్రదర్శించడం వ్యూహాత్మక ఎత్తుగడగా విజయన్ తన చర్యను సమర్ధించుకున్నట్లు తెలుస్తున్నది. ఘర్షణ ధోరణులు విడనాడి సుపరిపాలనపై దృష్టి సారింపలేని ఈ సందర్భంగా పలువురు సిపిఎం నేతలు సహితం స్పష్టం చేస్తున్నారు.
ఈ విషయమై గత గురు, శుక్రవారాల్లో జరిగిన పార్టీ-రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశంలో చర్చించారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయడంలో అర్థం లేదని ఈ సందర్భంగా భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం `లొంగిపోవడం’ అనాలోచితమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కానం కానం రాజేంద్రన్ తీసుకున్న వైఖరికి సీపీఎం నేతలు భిన్నమైన వైఖరిని అనుసరించాలని నిర్ణయించింది.
కేరళలో మొదటి, రెండవ వామపక్ష ప్రభుత్వాలకు నేతృత్వం వహించిన ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్, ప్రజల ప్రజాస్వామ్య విప్లవం పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి, వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అధికారాన్ని ఒక సాధనంగా భావించారు. ఇతర సిపిఎం ముఖ్యమంత్రులు ఇ కె నాయనార్, వి ఎస్ అచ్యుతానందన్ కూడా ఈ మార్గాన్ని గట్టిగా విశ్వసించారు.
“మేము పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించే దశలో ఉన్నాము. ప్రభుత్వం దానిపై మరింత దృష్టి సారించింది. ప్రస్తుత ప్రభుత్వం మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టనుంది. అవాంఛిత రాజకీయ వివాదాలు ఈ ప్రాజెక్టుల నుండి దృష్టిని మళ్లిస్తాయి, ఇది ఇప్పుడు రాష్ట్రానికి చాలా ముఖ్యమైనదని మేము భావిస్తున్నాము” అని ప్రస్తుత ముఖ్యమంత్రి అందుకు భిన్నమైన ధోరణిలో స్పష్టం చేసిన్నట్లు చెబుతున్నారు.
ఇటీవల కమ్యూనిస్టు ఉద్యమాలపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన విమర్శలు కూడా సీపీఎం జాగ్రత్తగా వ్యవహరించేలా చేసింది. “ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సీపీఎం ఒక్క రాష్ట్రంలోనే అధికారంలో ఉన్నప్పటికీ, అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ మనల్ని టార్గెట్ చేస్తోంది. గవర్నర్, సీఎంల మధ్య జరిగిన పోరును జాతీయ స్థాయిలో చిత్రీకరిస్తారు’’ అంటూ ఓ సిపిఎం నేత హెచ్చరించారు.
గత గురువారం పార్టీ సెక్రటేరియట్ సమావేశంలో గవర్నర్ ఖాన్‌తో తన చర్యను సిఎం పినరయి నివేదించినప్పుడు, వ్యూహాత్మక తిరోగమనం తీసుకోవడమే ఉత్తమ మార్గం అని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “అన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఖాన్‌తో మనకు కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. బెంగాల్ లాంటి దృష్టాంతాన్ని మళ్లీ సృష్టించే ఇతర హార్డ్‌కోర్ సంఘ్ పరివార్ వ్యక్తులకు చోటు కల్పించడం కంటే ఆయనను ఇక్కడ పనిచేసుకొనేటట్లు చేయడం మంచిది” అని మరొక సిపిఎం నాయకుడు స్పష్టం చేశారు.
పిడివాదాన్ని, విడిచి కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఆచరణాత్మక విధానం ఆవలంభిస్తున్నట్లు ఇప్పుడు పరిశీలకులు భావిస్తూరు. ప్రజలు సిద్ధాంతాల ప్రాతిపదికపై కాకుండా ప్రభుత్వాలను పనితీరును బట్టి అంచనా వేస్తారు.
అందుకనే సిద్ధాంతాల వివాదాలను విడిచిపెట్టి, మంచి పరిపాలన అందించే మార్గాలను అన్వేషించే ప్రయత్నం ఇప్పుడు విజయన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అదే విధంగా కేంద్ర – రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నిత్యం వివాదాలకు పోకుండా, రాష్ట్రానికి గరిష్టంగా ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారు.