తమిళనాడులోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డిఎంకె తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. చెన్నై కార్పొరేషన్లో క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. అన్నాడిఎంకెకు కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులోను డిఎంకె జోరు కొనసాగుతోంది. కోయంబత్తూరులో 75 శాతానికి పైగా స్థానాల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది.
మంగళవారం రాత్రి 8 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం రాష్ట్రంలోని కార్పొరేషన్లలో మొత్తం 1374 వార్డులకు గాను డిఎంకె 425 స్థానాల్లో జయభేరి మోగించగా, 75 చోట్ల అన్నా డిఎంకె గెలుపొందింది. అయితే సొంతంగా పోటీచేసిన బిజెపి అనూహ్యంగా పలుచోట్ల తన ఉనికి చాటుకో గలిగింది.
అలాగే పురపాలికల్లో 3843 వార్డు సభ్యులకుగాను డిఎంకె 1832 గెలుచుకోగా, అన్నాడిఎంకె 494 స్థానాలకు పరిమితమైంది. అలాగే 7,621 పట్టణ పంచాయతీలకుగాను డిఎంకె 4261 చోట్ల గెలుపొందగా, అన్నాడిఎంకె 1178 చోట్ల గెలుపొందింది.
చెన్నై మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 200 వార్డులకుగాను 195 వార్డుల ఫలితాలు వెలువడగా, 146 చోట్ల డిఎంకె గెలుపొందగా, అన్నాడిఎంకె 15స్థానాలకే పరిమితమైంది. మూడు వార్డుల్లో గెలుపుతో కాంగ్రెస్ మూడో స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు పదేళ్ల తర్వాత ఇటీవల ఎన్నికలు జరగ్గా మంగళవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ భారీ విజయాలను నమోదు చేయడంపై డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. తమ తొమ్మిది నెలల సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్‌గా ఈ ఫలితాలను ఆయన అభివర్ణించారు.
బీజేపీకి మూడో స్థానం
ఈ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానాన్ని దక్కించుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. డీఎంకే, అన్నాడీఎంకే తరువాతి స్థానంలో కమలదళం ఉందని ఆయన చెన్నైలో చెప్పారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐని వెనక్కు నెట్టి బీజేపీ ముందుకు దూసుకెళ్లింది. ఇప్పటి వరకూ ప్రకటించిన ఫలితాల్లో 22 మున్సిపల్ కార్పోరేషన్, 58 మున్సిపల్ కౌన్సిల్ 233 పంచాయత్ సీట్లలో కాషాయ దళం ముందుంది.
ఎరనైల్ టౌన్ పంచాయితీ ఎన్నికల్లో 15కు గానూ 12 స్థానాల్లో నెగ్గి బీజేపీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 19న జరిగిన ఈ ఎన్నికల్లో డీఎంకే రికార్డ్ స్థాయిలో విజయాలు నమోదు చేసింది. రెండో స్థానంలో అన్నాడీఎంకే నిలిచింది.
మొత్తం సీట్లలో 43 శాతమే పోటీచేసిన బిజెపి మొత్తం ఓట్లలో 5. 33 శాతం ఓట్లు పొందింది. పదేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో పొందిన ఓట్లకంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. పోటీ చేసిన సీట్లలో 12.49 శాతం ఓట్లు పొందింది. మొదటిసారిగా ఆయకుడి మునిసిపాలిటీని, మందక్కడ్ నగర పంచాయతీని కూడా గెల్చుకోండి.
చెన్నైలో డీఎంకేకు కంచుకోటగా భావించే తంబరం సీట్ ను బీజేపీకి గెల్చుకొంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు శుభసంకేతంగా ఫలితాల్నిఅన్నామలై వర్ణించారు. ప్రతిపక్ష హోదాలో అన్నాడీఎంకే కంటే తామే బాధ్యతగా వ్యవహరించడమే బహుశా ఈ ఫలితాలకు కారణమై ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు. తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు ఉంది. అయితే ఎక్కువ సీట్ల కోసం అర్బన్ ఎన్నికలకు మాత్రం విడివిడిగా పోటీ చేశాయి.
కాగా, ఈ ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ అన్నాడీఎంకేల మధ్య పొత్తు రాబోయే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు, వీలైతే ఆపై అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశాడు అన్నామలై.