కరోనా సమయంలో పార్టీలు చేసుకున్నారంటూ అధికార పక్షం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు మెడకు మరో ఉచ్చు బిగియనుంది. మహమ్మారి సమయంలో ప్రజలకు, కంపెనీలకు సాయం అందించేందుకు బ్రిటన్ చేపట్టిన పలు పథకాల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుందని ది గార్డియన్ కథనం పేర్కొంది.
మొత్తం 16 బిలియన్ పౌండ్లు (రూ. 1.62 లక్షల కోట్లు) అవినీతి జరిగిందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తేల్చినట్లు వెల్లడించింది. దీంతో పాటు ట్రెజరీ డిపార్ట్మెంట్ వ్యక్తిగత పథకాల్లో మోసాలు, నష్టాలను లెక్కగట్టి 2022 చివరి నాటికి ఎంత రికవరీ చేస్తారో వెల్లడించాలని లేఖను పంపింది.
కరోనా సమయంలో యుకె ప్రభుత్వం 129 మిలియన్ పౌండ్లను విడుదల చేయగా.. ఈ పథకాలు వేగంగా అమలు చేయడంలో పలుచోట్ల మోసాలు, కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. బలవంతపు సెలవుపై పంపిన ఉద్యోగులను ఆదుకొనేందుకు ప్రవేశపెట్టిన ‘ ది కరోనా వైరస్ జాబ్ రిటెన్షన్ స్కీం’లో భారీగా మోసం (5.3 బిలియన్ పౌండ్లు) జరిగినట్లు తేలింది.
చిన్న కంపెనీల కోసం చేపట్టిన ‘ ది బౌన్స్ బ్యాక్ లోన్ స్కీం’లో 4.9 బిలియన్ పౌండ్ల మోసాలు జరిగాయి. ఈ పథకాలు అమలులో లోపాలు, ప్రణాళిక లేమీ, వ్యవస్థీకృత లోపాలు .. ఈ కుంభకోణానికి కారణమైనట్లు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదిక తేల్చింది.