తక్షణమే హింసకు తెర దించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ కు విజ్ఞప్తి చేశారు. అన్ని పక్షాలు దౌత్యపరమైన చర్చల మార్గానికి తిరిగి రావాలని ఆయన కోరారు. ఉక్రెయిన్ రష్యా దాడి తర్వాత గత రాత్రి పుతిన్ తో ఆయన టెలిఫోన్ లో మాట్లాడారు. యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత పుతిన్‌తో మాట్లాడిన తొలి దేశాధినేత మోదీయే కావడం గమనార్హం.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ టెలిఫోన్ సంభాషణ అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, ‘‘హింసకు తక్షణమే తెర దించాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన చర్చలు, సంభాషణల మార్గానికి తిరిగి రావడం కోసం అన్ని పక్షాలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు’’ అని తెలిపింది.
అదేవిధంగా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల భద్రతపట్ల భారత దేశ ఆందోళన గురించి పుతిన్‌కు తెలిపారని ఈ ప్రకటన పేర్కొంది. భారతీయులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రత పట్ల తమకు ఆందోళన ఉందని, వీరిని సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారని పేర్కొంది.
ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌కు సంబంధించిన ఇటీవలి పరిణామాలను మోదీకి వివరించారు. దీనిపై మోదీ స్పందిస్తూ, రష్యా, నాటో గ్రూప్ మధ్య భిన్నాభిప్రాయాలను నిజాయితీతో కూడిన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడం సాద్యమవుతుందని స్పష్టం చేశారు.
అంశాలవారీగా సమస్యలపై తమ అధికారులు, దౌత్య బృందాలు నిరంతరం సంప్రదించుకోవాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.