రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమని తెలిపింది. చర్చలకు బెలారస్ రాజధాని మిన్స్క్కు రష్యా బృందాన్ని పంపిస్తామని వెల్లడించింది. ఉక్రెయిన్ బలగాలు ఆయుధాలు వీడితే తాము చర్చలకు సిద్ధమేనని అంతకు ముందే రష్యా విదేశాంగ మంత్రి ప్రకటించారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్లో సంభాషించిన తర్వాత రష్యా అధ్యక్ష కార్యాలయం ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం. యుద్ధాన్ని ఆపాలని జిన్‌పింగ్ కూడా పుతిన్‌కు సూచించారు. మరోవైపు యుద్ధాన్ని ఆపాలని, చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా రష్యాను కోరారు. ఉక్రెయిన్‌కు తటస్థ స్థాయిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు.
ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరరాదని, తటస్థ వైఖరి అవలంబించాలని రష్యా మొదటినుంచీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లారోవ్ కూడా కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమని ప్రకటించారు.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేసి ఉక్రెయిన్ లో కొనసాగుతున్న సంక్షోభం పరిస్థితులపై మాట్లాడారు. చర్చల ద్వారానే రష్యా, ఉక్రెయిన్లు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన ఆయన రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని పరిస్థితి వేగంగా మారిపోతున్నాయని, రష్యా, ఉక్రెయిన్ మధ్య సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మద్దతుగా ఉంటానని జిన్ పింగ్ తెలిపినట్లు చైనా మీడియా పేర్కొంది. వైమానిక దాడులుతో పాటు ఉక్రెయిన్ భూభాగంలోకి సైనిక దళాలు దూసుకెళుతున్న నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని విడిచిపెట్టి.. అన్ని దేశాల భద్రతను దృష్టిలో పెట్టుకుని, వాటిని గౌరవించి… ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని పుతిన్‌కు జిన్‌పింగ్ సూచించారు. కాగా, తాను ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక ఆపరేషన్ ఎందుకు చేపట్టవలసి వచ్చిందో.. జిన్‌పింగ్‌తో పుతిన్ చెప్పినట్లు సమాచారం.
రష్యా దీర్ఘకాలంగా వ్యక్తం చేస్తున్న భద్రతా ఆందోళనలను నాటో, అమెరికా నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ఆపరేషన్‌కు ఆదేశాలిచ్చినట్లు పుతిన్.. జిన్‌పింగ్‌తో అన్నారని.. చైనా మీడియా పేర్కొంది. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు జిన్‌పింగ్‌తో పుతిన్ సంకేతాలిచ్చారని తెలిసింది.
కాగా, ఉక్రెయిన్‌తో చర్చలకు విదేశాంగ,రక్షణ శాఖ అధికారులతో కూడా ప్రతినిధి బృందాన్ని తరలిస్తున్నట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ధిమిత్రి పెస్కోవ్ తెలిపారు. చర్చల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమర్ జెలెన్స్కీ ప్రతిపాదనను పుతిన్ తిరస్కరించిన కొన్ని గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే కీవ్ ముందుగా లొంగిపోవాలని పేర్కొంది.