దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసిలో పెట్టుబడుల ఉపసంహరణకు సులభతరం చేసే చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఐపిఒగా మారనున్న ఎల్ఐసిలో ఆటోమేటిక్ విధానంలో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డిఐ) కేంద్రం క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎల్ఐసిలో ఎఫ్డిఐ దారులు పాల్గొనే వీలు కలుగుతుంది. ఇప్పటికే దేశీయ బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్డిఐకి నేరుగా అనుమతి ఉండేది కానీ.. ఇందుకు ఎల్ఐసి మినహాయింపు.
పార్లమెంట్లో చట్టం చేసి ఎల్ఐసిని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయడం వల్ల ఈ నిబంధన ఈ సంస్థకు వర్తించదు. ఇప్పుడు ఎల్ఐసిలోకి ఎఫ్డిఐ అనుమతించడంతో విదేశీ పెన్షన్ ఫండ్లు, బీమా సంస్థలు దేశంలోనే అతిపెద్ద ఐపిఒగా భావిస్తున్న ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూలో పాల్గనే వీలుంటుంది. దేశీయ సంస్థల్లో 10 శాతం అంతకన్నా ఎక్కువ వాటాను కొనే విదేశీ వ్యక్తి లేదా సంస్థను ఆర్బిఐ గుర్తిస్తుంది.
మరోవంక, . కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం వచ్చే ఐదేళ్లకుగానురూ 1,600 కోట్లు కేటాయించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ అమలు చేస్తుంది.
ఈ పథకం కింద ఇప్పటివరకు 17 కోట్లకు పైగా అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని ప్రకటించింది కేంద్రం. డిజిటల్ టెక్నాలజీని వాడుకోవడం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు పొందే వీలవుతుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఈ వేలం విండో ద్వారా బొగ్గు కంపెనీలు బొగ్గు అందించడానికి కూడా మంత్రివర్గం ఆమోదించింది.