బిగ్ బాస్ షో ఓ అధికారిక వ్యభిచార గృహం అంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగులో స్టార్ మాలో బిగ్ బాస్ షోన్ ఇప్పటివరకు 5 సీజన్లుగా ప్రసారం అయ్యింది. బిగ్ బాస్ తెలుగు హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషాల్లో కూడా షో నడుస్తున్నది.
తెలుగులో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. శనివారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం ప్రారంభమైనది. ఈ సందర్భంగా దీనిని రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. భక్తి రస చిత్రాల్లో నటించిన నాగార్జున బిగ్బాస్ వంటి షోకు వ్యాఖ్యాతగా చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
బిగ్బాస్ అనే లైసెన్స్ పొందిన షోలో 100 మందిని 100 రోజుల పాటు ఒకచోట ఉంచి అనైతిక చర్యలకు పాల్పడేందుకు వీలు కల్పిస్తున్నారని ఆరోపించారు. మహిళలను అవమానపరిచే విధంగా ఈ షో ఉంటోందని పేర్కొంటూ దీన్ని ప్రభుత్వం నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.
బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా ఇప్పటికే లేఖలు రాశామని నారాయణ గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్ లో కేసు పెడదామని ప్రయత్నిస్తే పోలీసులు తమ పరిధి కాదంటున్నారని ఆయన చెప్పారు. దీంతో తాము కోర్టులో కేసులు వేశామని చెప్పారు. ఇప్పుడు తమ పార్టీ ఆధ్వర్యంలో బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు నారాయణ వెల్లడించారు.
బిగ్బాస్ షో లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని గుర్తు చేశారు. 200 కెమెరాలు పెట్టాం అంటున్నారని, అయితే, అందులో ఏం జరుగుతుందో అంతా ఎడిటింగ్తో తీసేస్తారని ఆయన తెలిపారు. ఈ షో ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆయన నిలదీశారు.