ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా చిక్కుకు పోయిన భారతీయులలో 469 మంది ప్రయాణికులతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు ఎయిర్ ఇండియా విమానాలు స్వదేశంకు చేరుకొన్నాయి. మొదటి విమానం గత రాత్రి 219 మంది ప్రయాణికులతో ముంబైకు చేరుకోగా, రెండో విమానం 250 మందితో ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకొంది.
ఈ సందర్భంగా స్వదేశానికి చేరుకున్న ప్రయాణికులకు స్వయంగా కేంద్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. ముంబైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమానాశ్రయంలో స్వాగతం పలకగా, ఢిల్లీ విమానాశ్రయంలో పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విమానంలో ఉన్నవాళ్లంతా మంత్రులను చూడగానే ఆనందోత్సవాలతో జై హింద్ అంటూ నినాదాలు చేశారు. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన పనిలేదని మంత్రులు వారికి భరోసా ఇచ్చారు. ఉక్రెయిన్‌లో ఉన్న మిగిలిన భారతీయులందర్నీ కూడా క్షేమంగా భారత్‌కు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడారని ఆయన చెప్పారు. రష్యా కూడా భారతీయులందరికీ క్షేమంగా పంపిస్తామని హామీ ఇచ్చిందని గోయల్ వారికి తెలిపారు. ఉక్రెయిన్‌లో వారి స్నేహితులకు కూడా ధైర్యం చెప్పాలని మంత్రి కోరారు.
ఈ సందర్భంగా వారిని తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా సిబ్బందికి కేంద్రమంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మధ్యాహ్నం రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి విమానం బయలుదేరి భారత్ కు చేరింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణంతో అక్కడ నుంచి భారత విద్యార్థుల తరలింపు శనివారం నుంచి మొదలైంది.
మరో రెండు విమానాలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు విమానాల్లోని భారతీయుల్లో 13 మంది తెలుగు విద్యార్థులున్నారు. వీరందరిని వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రులు చెప్పారు.
తొలి విమానంలోని 219 భారతీయుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. తెలుగు విద్యార్థులు పోతుల వెంకట లక్ష్మీధర్‌రెడ్డి, తెన్నేటీ వెంకట సుమ, అర్ఫాన్ అహ్మద్, అమ్రితాంష్, శ్వేతశ్రీలు తొలి విమానంలో భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు.