ఉక్రెయిన్ రక్షణ స్థావరాలు, నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తే భయంతో ఉక్రెయిన్ ప్రభుత్వం కాళ్ళ బేరానికి వస్తుందని ఆశించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ అంచనాలు తలకిందులైన్నట్లు కనిపిస్తున్నది. రెండు రోజుల భీకర దాడుల తర్వాత మూడోరోజు కొంచెం దాడులను నెమ్మదించినా ఉక్రెయిన్ ప్రభుత్వం దిగిరాక పోగా మరింత ఉధృతంగా ప్రతిఘటన చేస్తుండడంతో విస్తుపోయిన్నట్లు కనిపిస్తున్నది.
అటువంటి ప్రతిఘటనను ఉహించినట్లు లేదు. అందుకనే నాలుగోరోజు దాడులను మరింత ఉధృతం చేశారు. ఉక్రెయిన్ రాజధానిని స్వాధీనం చేసుకోవడం కష్టతరంగా కనిపించింది. సాధారణ ప్రజలు కూడా తిరగబడుతూ ఉండడం విస్మయం కలిగిస్తున్నది. శాంతి చర్చలకు ప్రతిపాదించినా ఉక్రెయిన్ ప్రభుత్వం విముఖంగా ఉండడం, జనం మధ్య ఉంటూనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ..పోరాటానికి నేతృత్వం వహిస్తూ ఉండడంతో కొంచెం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.
దానితో దీర్ఘకాలం పోరు తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అంతర్జాతీయంగా విధిస్తున్న ఆంక్షల కారణంగా రష్యా ఆర్ధిక పరిస్థితి విషమంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.
ఉక్రెయిన్ ప్రజల నుంచి రష్యా బలగాలకు తీవ్రమైన తిరుగుబాటు వస్తోంది. రష్యా బలగాలకు తలొగ్గేది లేదని ఒకవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్తుండగా, స్థానికులు కూడా అందుకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారు. తమ దగ్గర ఉండే వస్తువులతో. రష్యా సైనికులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద ఇనుపరాడ్లతో రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే రష్యన్ యుద్ధ ట్యాంకులపై విసిరేందుకు పెట్రోల్ బాంబులు తయారు చేస్తున్నారు. మహిళలు కూడా తుపాకులు చేతబట్టి యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. చివరకు చిన్న పిల్లలు కూడా ఒట్టి చేతులతోనే రష్యా సైనికులను ఎదిరిస్తున్నారు.
రోడ్డుపై తుపాకులతో పహారా కాస్తున్న రష్యా సైనికుడిని ఓ 12 ఏళ్ల బాలిక నిలదీసింది. ఎందుకొచ్చావు మా దేశానికి.. మీ దేశానికి వెళ్లిపోండి.. పోతారా.. కొట్టమంటారా అంటూ పిడికిలి బిగించి రష్యా సైనికుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం చూసి రష్యా సైనికుడు విస్తుబోయాడు.
ఏమాత్రం భయం లేకుండా తన మీదమీదకు వస్తున్న బాలికకు దూరంగా వెళ్లిపోయాడు ఆ సైనికుడు.. రష్యా సైనికుడిపై కోపంతో.. ఆవేదనతో బాలిక ఎదిరించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాంబు దాడులతో భీతిల్లుతున్న ఉక్రెయిన్ ప్రజలు తమ దేశానికి ఈ పరిస్థితి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు.. తన ఇంటిపై బాంబులేసి కాల్చడంపై ఓ మహిళ పుతిన్ కు థ్యాంక్స్ చెప్పింది. తనను పిల్లాపాపలతో రోడ్డు మీదకు తెచ్చారని.. మీరు కోరుకునేది ఇదేనా అని ప్రశ్నించింది.
‘‘రష్యాపై, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌పై నాకు చాలా కోపంగా ఉంది. మా దేశ ఉనికిని, హక్కులను ఆయన ఎందుకు కాలరాస్తున్నాడో అర్థం కావడం లేదు. ఊరు విడిచి వెళ్లిపోవాలని నన్ను, నా కుటుంబాన్ని రష్యా సైనికులు బెదిరించారు”అని ఉక్రెయిన్ ఎంపీ కైరా రూడిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఒక తుపాకీ తీసుకొని రష్యా సైనికులపైకి పోరుకు దిగారు.
‘‘ఎదో ఒక పని చేసుకొని మాకు బతుకు మేము బతుకుంటే శత్రువులు మా దేశంలోకి వచ్చారు. మేము యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. మా నుంచి శత్రు దేశం ఏమీ తీసుకుపోలేరు. మా దేశం కోసం మేము పోరాడుతాం” అని ఆమె స్పష్టం చేశారు.
“మమ్మల్ని మేము కాపాడుకోవడానికి నేను నా భర్త, స్నేహితులు ఫస్ట్ టైమ్ ఆయుధాలు పట్టాం. దేశంలోని చాలా మంది మహిళలకు ఆయుధాలను ఎలా వాడాలో శిక్షణ ఇచ్చారు. నా తోటి ఎంపీలు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు.ఉక్రెయిన్ కోసం దేశ ప్రజలంతా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు”అని ఆమె తెలిపారు.
ఉక్రెయిన్‌కు చెందిన బ్యూటీ క్వీన్ ఒకరు సైన్యంలో చేరారు. 2015లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లో ఉక్రెయిన్ తరపున పాల్గొన్న అనస్తాసియా లెన్నా అనే యువతి తుపాకీ చేతబట్టి, ఉక్రెయిన్ సైన్యంలో చేరింది. ఈమె మిస్ గ్రాండ్ ఉక్రెయిన్‌గా కూడా ఎన్నికైంది. ఆయుధం చేతబట్టిన అనంతరం లెన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో షేర్ చేసింది. ‘సరిహద్దు దాటి ఉక్రెయిన్‌లోకి ఎవరు చొరబడ్డా.. వాళ్లను అంతంచేస్తా’ అంటూ ఇన్‌స్టాలో పేర్కొంది.