రష్యా దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజేను ఆశ్రయించింది ఉక్రెయిన్. రష్యా తీవ్ర దుందుడుకు చర్యలతో మారణహోమానికి పాల్పడుతోందని, సైనిక చర్య పేరిట దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆరోపించారు.
జరుగుతున్న దారుణాలకు రష్యాను బాధ్యురాలిని చేయాలని ఐసీజేని కోరారు. రష్యా తక్షణమే సైనిక చర్యలను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, తమ పిటిషన్ పై వచ్చే వారం విచారణ జరుగుతుందని భావిస్తున్నట్టు జెలెన్ స్కీ వెల్లడించారు.
మరోవంక బెలారస్ వేదికగా రష్యాతో చర్చలకు నిరాకరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మనసు మార్చుకొని సిద్ధమని ప్రకటించారు. చర్చలకు రాకుండా ఉక్రెయిన్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించిన కొద్దిసేపటికే జెలెన్స్కీ ఈ ప్రకటన చేశారు. గెమెల్లో భేటీకి అంగీకరించారు.
రష్యా సైనిక దాడికి నిరసనగా యూరోపియన్ దేశాలతోపాటు ఉక్రెయిన్, బెల్జియం, ఫిన్లాండ్, కెనడా దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై కొత్త ఆర్థిక ఆంక్షలను కూడా ప్రకటించాయి. ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోని రెసిడెన్షియల్ భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో భవనంలోని రెండు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి.
అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఉక్రెయిన్‌పై సోమవారం నాటో నేతలతో సమావేశం కానున్నారు.యూరోపియన్ యూనియన్ తన భూభాగంలో ల్యాండింగ్, టేకాఫ్, ఎగురుతున్న రష్యన్ విమానాలను నిషేధించింది.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా ఆస్తుల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలను యూరోపియన్ యూనియన్ నిషేధించింది.
ఉక్రెయిన్ రాజధాని కైవ్, ఖార్కివ్‌లలో పేలుళ్లు వినిపించాయని ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది.
కాగా, ఇప్పటి వరకు తమ సైనికులు రష్యా ఆర్మీకి చెందిన 4,300 మందిని హతమార్చినట్లు ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మాల్యార్ ప్రకటించారు. రష్యాకు చెందిన 146 యుద్ధ ట్యాంకులు, 27 యుద్ధ విమానాలు, 26 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు ఆమె ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.
మరోవైపు ఉక్రెయిన్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ దేశానికి చెందిన 471 మంది సైనికులను బంధీలుగా మార్చినట్లు చెప్పింది. సైనిక చర్య ప్రారంభమైన గురువారం ఉదయం నుంచి ఆదివారం వరకు 975 మిలటరీ బేస్‌లను ధ్వంసం చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ చెప్పింది.
ఉక్రెయిన్‌కు చెందిన 8 ఫైటర్ ప్లేన్లు, 7 హెలికాప్టర్లతో పాటు 11 డ్రోన్లను నేలకూల్చినట్లు వెల్లడించింది. 28 ఎయిర్ క్రాఫ్టులతో పాటు 223 యుద్ధ ట్యాంకులను తమ సైన్యం ధ్వంసం చేసిందని రష్యా స్పష్టం చేసింది.
ఇలా ఉండగా, భారతీయ విద్యార్థులకు వీసా లేకుండా తమ దేశంలోకి అనుమతిస్తామని పోలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తామని వెల్లడించింది.
ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులను ఎలాంటి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించేందుకు పోలాండ్ అనుమతిస్తున్నట్లు పోలాండ్ రాయబారి ఆడమ్ బురకోవ్స్కీ ఆదివారం తెలిపారు.