డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణి పూర్వ సంచాలకులు
తెలుగు సారస్వత లోకంలో పాతికేళ్ళ క్రితం ఒక సృజనాత్మక ప్రయోగం మొదలైంది. 1997 ఫిబ్రవరి 22న ఆంధ్రప్రదేశ్ కొసన ఉండే శ్రీకాకుళంలో తెలుగు కథా సాహిత్యమే ప్రధాన నెలవుగా ‘కథానిలయం’ గ్రంథాలయం ఏర్పడింది. ఇప్పుడు అది శ్రీకాకుళం పట్టణానికి ఒక ఆనవాలుగా భాసిస్తోంది.
కాళీపట్నం రామారావు ప్రారంభించిన ఈ గ్రంథాలయం దేశంలోనే ప్రత్యేకమని కొందరంటుండగా ప్రపంచంలోనే అటువంటి ప్రయత్నం జరగలేదని మరికొందరంటున్నారు. అటువంటి మరో ప్రయోగం తెలుగునాట కృష్ణా జిల్లాలో ఉయ్యూరు సమీపాన ఉండే ముదునూరు గ్రామంలో 2022 ఫిబ్రవరి 21వ తేదీన మొదలైంది.
తెలుగులో వెలువడిన స్వీయచరిత్రలు, జీవిత చరిత్రలు, జీవిత విశేషాలను తెలిపే వ్యాసాల సంపుటుల కొరకు ‘నాగులపల్లి సీతారామయ్య, సోమిదేవమ్మ పిల్లల గ్రంథాలయం’గా మీడియా పరిశోధకులు డా.ఎన్.భాస్కరరావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రోద్యమానికి, గ్రంథాలయోద్యమానికి పెద్ద పీట వేసిన ముదునూరులో ఇటువంటి గ్రంథాలయం ప్రారంభం కావడం హర్షణీయం.
ఫిక్షన్ రచయితలకు, నాన్ ఫిక్షన్ అంటే కొంత తేలిక భావం ఉంటోంది. అలాగే చరిత్ర అన్నా, చరిత్రను జాగ్రత్త చేసుకోవాలన్నా పెద్దగా పట్టింపు లేని భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి జీవిత చరిత్రలంటే కూడా గొప్ప ఆసక్తి ఉందని చెప్పలేము. ప్రపంచవ్యాప్తంగానే రెండు శతాబ్దాలకు మించి మాత్రమే స్వీయచరిత్రల ప్రస్థానం ఉందని తెలుస్తోంది.
తెలుగులో తొలి స్వీయచరిత్ర ఆంగ్లంలో వెలువడింది. అది వెన్నెలకంటి సుబ్బారావు (1784-1839) రాసుకున్న ‘లైఫ్ అండ్ జర్నల్ ఆఫ్ వి.సుబ్బారావు’ అనే ఆంగ్లరచన. 1878లో ఇది ప్రచురింపబడింది. దీని తెలుగు అనువాదం ఐదు దశాబ్దాల క్రితం అక్కిరాజు రమాపతిరావు గారు చేశారు.
మొదటి తెలుగువారి స్వీయచరిత్ర ఆంగ్లంలో వెలువడగా, రెండవది పరవస్తు వెంకట రంగాచార్యులు రాసుకున్న సంస్కృత రచన. తరవాత 1994లో మండపాక పార్వతీశ్వరశాస్త్రి పద్యరూపంలో స్వీయచరిత్ర వెలువడింది. ఆదిభట్ల నారాయణదాసు ‘నా యెరుక’ తరువాత రాయబడినా, ప్రచురణపరంగా తొలుత వెలువడింది కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్ర (1911) మొదటి భాగం.
1916లో రాంభట్ల జగన్నాథ శాస్త్రి స్వీయచరిత్రం వెలుగు చూసింది. అక్కిరాజు రమాపతిరావు పరిశోధన ‘తెలుగులో స్వీయచరిత్రలు’ ప్రకారం 1911 నుంచి 1984 మధ్య (అంటే తొలి ఏడు దశాబ్దాల్లో) తెలుగులో సుమారు వంద స్వీయ చరిత్రలు వుంటాయి. మరి ఇప్పటికి ఆ సంఖ్య ఎంత వుండవచ్చు.. అనేది సరైన పరిశోధన జరిగితే కానీ చెప్పలేం. అయితే, చాలా పెద్ద సంఖ్యలో వచ్చివుంటాయని మాత్రం భావించలేం.
స్వీయచరిత్ర, ఆత్మకథ అని సమగ్రంగా వెలువరించిన రచనలు కొన్ని వుండగా అర్థాంతరంగా ఆగిపోయిన రచనలు మరికొన్ని వున్నాయి. నా బాల్యం, నా చిన్నప్పుడు, జ్ఞాపకాలు, నా స్మృతులు, నా అనుభవాలు, నా ఉద్యోగ జీవితం వంటి ప్రణాళికతో కొన్ని రచనలు వచ్చి వుండవచ్చు. వీటిని కూడా స్థూలంగా స్వీయ చరిత్రలుగానే లేదా స్వీయచరిత్ర శకలాలుగానే పరిగణించాలి. ఇలాంటి వాటిని కలిపినప్పుడు ఈ సంఖ్య ఎంతకు పెరగవచ్చు?
తెలుగు స్వీయచరిత్రల పోకడలు పరిశీలిస్తే కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా కనబడతాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణా ప్రాంతాల నుంచి స్వీయచరిత్రలు ఎక్కువ సంఖ్యలో రాలేదు. అలాగే బడుగు వర్గాల, కిందిస్థాయి తరగతుల వ్యక్తులు రాసుకున్న స్వీయచరిత్రలు కూడా బాగా తక్కువ.
అలాగే మహిళలు రాసుకున్న ఆత్మకథలు కూడా తక్కువే. ఇటీవలి కాలంలో డా. గీతామాధవీకళ తన ఇంటర్నెట్ పత్రిక ‘నెచ్చెలి’ ద్వారా చాలా మంది స్త్రీలతో వారి జీవిత విశేషాలు, అనుభవాలు, జ్ఞాపకాలు వంటివి రాయిస్తున్నారు. ఇలా వెలువడిన రచనల ఆధారంగా ఇప్పటికే కొన్ని పుస్తకాలుగా వచ్చాయి. ముందు ముందు మరిన్ని వచ్చే అవకాశం వుంది.
ఇటువంటి ప్రయత్నం సాధారణ స్వీయచరిత్రల రచన గురించి కానీ, పీడిత తాడిత వర్గాల నుంచీ కానీ రాయించడానికి ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ కోవకు చెందిన రచనలు చేయించుకుంటున్నారు. ఇటువంటి వాటికి రచయిత ఇంకొకరు ఉండడం గమనించాల్సిన విషయం.
స్వీయచరిత్రతో పోలిస్తే… జీవిత చరిత్ర పరిస్థితి తెలుగులో మెరుగ్గానే ఉందేమో! ప్రపంచ శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, స్వాతంత్య్రోద్యమంలో పోరాడిన త్యాగధనులు, ఇతర భాషా ప్రాంతాల్లో గణనీయమైన సేవలు చేసిన వ్యక్తుల గురించి ఆసక్తి కలిగి, స్ఫూర్తితో రచనలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఒక విదేశీ ప్రముఖుడి గురించి తెలుగులో పూర్తిస్థాయి జీవిత చరిత్రను తొలుత వెలువరించింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఇలా వెలువడిన అబ్రహాం లింకన్ జీవిత చరిత్ర కొమర్రాజు లక్ష్మణరావు బృందం నడిపిన విజ్ఞాన చంద్రికా మండలి తొలి ప్రచురణ.
ఇదే కోవలో దేశదేశాల ప్రముఖుల గురించి ఐదారు పేజీల వ్యాసాలున్న సంపుటులు కూడా బాగానే ఉన్నాయి. వార్తాపత్రికల అవసరాలు, ప్రజల ఆసక్తి, విద్యార్థుల పరీక్షల అవసరాలు ఆధారంగా ఇటువంటి వ్యాస సంపుటులు బాగానే వచ్చి వున్నాయి.
ఈ విధమైన స్వీయచరిత్రలు, జీవిత చరిత్రలు, జీవిత విశేషాల సంపుటుల కోసమే ప్రత్యేకంగా ముదునూరులో 2022 మాతృభాషా దినోత్సవం రోజున ప్రారంభించినట్లు డా. నాగులాపల్లి భాస్కరరావు ప్రకటించారు.
ప్రముఖ పత్రికా సంపాదకులు కె.రామచంద్రమూర్తి, తెలుగు భాష ఉద్యమ నాయకులు, పూర్వ ఉపసభాపతి, మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ రచయిత, ఆకాశవాణి పూర్వ సంచాలకులు డా. నాగసూరి వేణుగోపాల్ సంయుక్తంగా ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించి, ప్రయత్నాన్ని కొనియాడారు.
ఇప్పటికున్న సమాచారం మేరకు దేశంలో ఇటువంటి ప్రయత్నం మొదటిది అంటున్నారు. ఈ ప్రత్యేకత విషయం ఎలా వున్నా ఇటువంటి ప్రయత్నం కారణంగా ఆసక్తి వున్న పిల్లలకు, తల్లులకు, యువతకు ఇటువంటి గ్రంథాలయం కచ్చితంగా ప్రయోజనకారి అవుతుంది.
అదే సమయంలో ఇటువంటి గ్రంథాలయం నిర్వహణలో మొదటి నుంచే జాగ్రత్త తీసుకుని తమ ప్రణాళికకు తగిన పుస్తకాలను మాత్రం ఎంచుకోవాల్సి ఉంటుంది. ముందు ముందు ఈ సంస్థ తమ సంస్థ ద్వారా తెలుగు స్వీయచరిత్రల పిడిఎఫ్లను వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చెయ్యాలి. తరువాత ఈ సదుపాయాన్ని జీవిత చరిత్రలకు విస్తరించవచ్చు.
తెలుగులో స్వీయచరిత్రల గురించి పెద్దగా పరిశోధన జరగలేదు. అక్కిరాజు రమాపతిరావు చిన్న పుస్తకం ‘తెలుగులో స్వీయచరిత్రలు’ (1984) ఒకటే ప్రస్తుతం అందుబాటులో ఉంది. కనుక తెలుగు స్వీయ చరిత్రలకు సంబంధించి పరిశోధన, పరిశీలన మరింత జరగాలి.
ఇంకా ఇంతకాలంగా కొన్ని ప్రధానవర్గాలే, పలుకుబడి గల కొంతమంది వ్యక్తులే తమ కథలనే చారిత్రక గాథలుగా చలామణిలోకి తెస్తూ వచ్చారు. కానీ, విస్తారమైన సమాజానికి అద్దం పట్టే స్వీయచరిత్రలు పెద్ద ఎ అనేవి చారిత్రక విలువ కలిగిన సోషల్ డాక్యుమెంట్ల వంటివి. శకలాలుగా వచ్చి పడే ఈ జీవితచరిత్రల ఆధారంగా ముందు త్తున రావాల్సి వుంది. నిజానికి స్వీయచరిత్రలుముందు సామాజిక, సామూహిక చరిత్రను మరింత సమగ్రవంతంగా నిర్మించుకోవడానికి వీలవుతుంది.
(ప్రజాశక్తి నుండి)