గతంలో ‘గుజరాత్ మోడల్’ అంటూ అక్కడి అభివృద్ధిపై జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం చేసి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడంకోసం ప్రచార వ్యూహాల రూపకల్పనలో క్రియాశీల పాత్రవహించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు `తెలంగాణ మోడల్’ పేరుతో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును జాతీయ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించే వ్యూహానికి రూపకల్పన చేసిన్నట్లు తెలుస్తున్నది.
సీఎం కేసీఆర్‌తో వరుసగా రెండురోజులు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయి ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో గుజరాత్‌ను మించి, దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ ఆశించిన రీతిలో వాటిని ప్రచారం చేసుకోలేకపోతుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ‘తెలంగాణ మోడల్’పేరిట ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు.
కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతు లేకపోయినా కాళేశ్వరం వంటి భారీ సాగునీటి పధకం పూర్తి చేయడం, తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న రైతుబంధు వంటి పలు పధకాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తూ, ఆ దిశలో కొత్త పధకాలు చేపట్టడం వంటి అంశాలను జాతీయ స్థాయిలో ప్రచారం చేయసంకల్పించారు.
ముఖ్యమంత్రి సూచన మేరకు శనివారం సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి మల్లన్నసాగర్ ప్రాజెక్టు, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను సందర్శించిన పీకే, ఆ తర్వాత కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. తిరిగి ఆదివారం ఉదయం కూడా ఫామ్‌హౌస్‌లో ముఖ్యమంత్రితో పీకే భేటీ కొనసాగినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అయితే తన పర్యటనలో ఎక్కడా మీడియా కంట పడకుండా పీకే జాగ్రత్త తీసుకున్నట్లు కనబడుతున్నది.
గోవా అసెంబ్లీ ఎన్నికలలో టిఎంసి కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ బృందం ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, కేసీఆర్ సర్కారుపై ఫీడ్‌బ్యాక్ సేకరించింది. పీకే స్వయంగా కొన్ని చోట్లకు వెళ్లి ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకున్నారు. ఈ వివరాలన్నీ కేసీఆర్‌కు వివరించినట్టు తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు, కేసీఆర్ ముంబై పర్యటనపై వచ్చిన ఫీడ్బ్యాక్పైనా చర్చించినట్టు సమాచారం. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ కూటమి ఏర్పాటు కోసం పీకే ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే పలు రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధినేతలను ఆయన కలిసి చర్చలు జరిపారు.
ఇదే ఎజెండాతో సీఎం కేసీఆర్ గత వారం ముంబై వెళ్లారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో కేసీఆర్ సమావేశమై ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చించారు. ప్రశాంత్ కిషోర్ ప్రచార వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఇటీవల కాలంలో అకస్మాత్తుగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలపై విరుచుకు పడుతున్నట్లు తెలుస్తున్నది.
ఎన్డీఏయేతర పార్టీల సీఎంలు, పార్టీ చీఫ్‌లతో త్వరలోనే సమావేశం నిర్వహించే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నా.. ఆయా రాష్ట్రాల సీఎంలు, పార్టీ చీఫ్‌ల అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో వాయిదా వేసుకున్నట్టు తెలుస్తున్నది.
సీఎంలు, పార్టీ అధ్యక్షులతో మాట్లాడి వారితో సమావేశం ఏర్పాటు చేసే బాధ్యత కూడా ప్రశాంత్ కిశోర్కే అప్పగించినట్టు టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రిటైర్డ్ బ్యూరోక్రాట్ల కాన్క్లేవ్పైనా పీకే చర్చించినట్టు తెలిసింది. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్లు, ఇతర స్కీంలపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇప్పటికే ప్రారంభించారు.
మూడేండ్ల వ్యవధిలోనే కాళేశ్వరం కట్టి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్తున్నారు. వీటిని జాతీయ ప్రత్యామ్నాయ కూటమి ఎజెండాలుగా చేయాలని పీకేకు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు చేసే ప్రయత్నాల ఫలితం ఏ విధంగా ఉన్నా, వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందే జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తనకు ప్రయోజనం జరుగగలదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.